
తాజా వార్తలు
ప్లీజ్ సర్..మాస్క్ పెట్టుకోండి
రాజ్ థాకరేకు ఎన్సీపీ లేఖ
ముంబయి: మహారాష్ట్రలో కొవిడ్ విజృంభణ తీవ్ర స్థాయిలో ఉంది. అక్కడ పదివేలకుపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మాస్కులు, భౌతిక దూరం పాటించే విషయంలో నిర్లక్ష్యం చూపొద్దని అక్కడి ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తోంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే మాత్రం ఈ మాటలను పట్టించుకోవడం లేదు. మాస్క్ పెట్టుకోనంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. దాంతో ఆ రాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన ఎన్సీపీ ఆయనకు బహిరంగ లేఖ రాసింది.
‘కరోనా వైరస్ కట్టడికి ప్రధాన ఆయుధం మాస్క్ అని మనందరికీ తెలిసిందే. మనలో చాలా మంది దాన్ని పాటిస్తున్నారు. ప్రజలను ఈ నియమాలు పాటించేలా చేయడంలో చాలా వరకు ప్రభుత్వం విజయం సాధించినప్పటికీ.. మనమింకా ఈ మహమ్మారితో పోరాడుతున్నాం. మీ అనుచరులకు మీ(రాజ్ సాహేబ్) మాటే వేదం. కొవిడ్-19కి సంబంధించి మీరు చేసే సూచనలను వారు తప్పకుండా పాటిస్తారు. అందుకే మీరు మాస్క్ ధరించి మీ అనుచరులకు, దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం. కొవిడ్‌పై పోరాటంలో మాకు బలం చేకూర్చాలని ఆశిస్తున్నాం’ అని ఎన్సీపీ లేఖలో పేర్కొంది.
రాజ్‌థాకరే పలుమార్లు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పటికీ మాస్క్ ధరించడానికి నిరాకరిస్తున్నారు. ఇటీవల నాసిక్ పర్యటనలో భాగంగా తన ఆఫీస్ బేరర్లలో ఒకరు మాస్క్ ధరించగా.. థాకరే ధాన్ని తీసేయమనడం గమనార్హం. ఈ వైఖరి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఆయన అనుచరులు కూడా ఇదేవిధంగా ప్రవర్తిస్తే..కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యలు వృథా అవుతాయని ఆందోళనపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు బహిరంగ లేఖ రాసింది.