Corona: 1000మంది విద్యుత్‌ ఉద్యోగులు మృతి!
close

తాజా వార్తలు

Published : 15/05/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: 1000మంది విద్యుత్‌ ఉద్యోగులు మృతి!

ఏఐపీఈఎఫ్‌ వెల్లడి

దిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ మృత్యునాదం చేస్తోంది. వేల మంది ప్రాణాల్ని బలితీసుకుంటూ అంతులేని విషాదం నింపుతోంది. దేశ వ్యాప్తంగా పవర్‌ సెక్టార్‌కు చెందిన దాదాపు 1000 మందికి పైగా ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్టు ఆల్‌ ఇండియా పవర్‌ ఇంజినీర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐపీఈఎఫ్‌) వెల్లడించింది. అలాగే, 15వేల మందికి పైగా ఈ వైరస్‌ బారిన పడ్డారని తెలిపింది. ఒక్క మహారాష్ట్రలోనే 7100 మంది విద్యుత్‌ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 210 మంది మృతిచెందారని ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, యూపీలో 4వేల మందికి వైరస్‌ సోకగా.. 140 మంది చనిపోయారని తెలిపింది. తమ రంగంలో పనిచేస్తున్న వెయ్యి మందికి పైగా ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు విడిచారని ఏఐపీఈఎఫ్‌ అధికార ప్రతినిధి వీకే గుప్తా ఓ ప్రకటనలో వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు చీఫ్ ఇంజినీర్లు (ఇద్దరు యూపీ, ఒకరు హరియాణా) ఉండగా... రెండు డజన్ల మందికి పైగా సూపరింటెండింగ్‌ ఇంజినీర్లు కూడా ఉన్నట్టు ఆయన తెలిపారు. వీరిలో తొమ్మిది మంది యూపీకి చెందినవారే ఉన్నారన్నారు. హరియాణాలో 20 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా.. 900 మంది వైరస్‌బారిన పడినట్టు వివరించారు. ఇకపోతే, పంజాబ్‌లో 700మంది వైరస్‌ బారినపడగా.. 20మంది మరణించారని పేర్కొన్నారు.

అన్ని రాష్ట్రాల్లో విద్యుత్‌ రంగంలో ఉద్యోగులకు సత్వరమే టీకా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌కు ఏఐపీఈఎఫ్‌ లేఖ రాసింది. టీకా వేయించడంలో తమ రంగానికి చెందిన ఉద్యోగులకు ప్రాధాన్యమివ్వడంతో పాటు  ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా పరిగణించి టీకా పంపిణీ చేయాలని కోరింది. కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌ వంటి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబాలకు ప్రత్యేకంగా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైనట్టు తెలిపింది. విద్యుత్‌ రంగంలో పనిచేసే ఉద్యోగులను ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా పరిగణించి సత్వరమే వారికి టీకా అందించేలా రాష్ట్ర ఆరోగ్యశాఖలను ఆదేశించాలని అన్ని రాష్ట్రాల సీఎంలను కోరింది. కరోనాతో మృతిచెందిన ప్రతి ఉద్యోగికి రూ.50లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్ర విద్యుత్తుశాఖ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఫెడరేషన్‌ కోరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని