AUKUS: చైనాకు చెక్ పెట్టేందుకు త్రైపాక్షిక రక్షణ కూటమి

తాజా వార్తలు

Published : 17/09/2021 23:53 IST

AUKUS: చైనాకు చెక్ పెట్టేందుకు త్రైపాక్షిక రక్షణ కూటమి

ఇంటర్నెట్‌ డెస్క్: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్ పెట్టేందుకు ఏర్పడిన త్రైపాక్షిక రక్షణ కూటమిపై అంతర్జాతీయంగా పలుదేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చైనా, ఫ్రాన్స్‌లు ఈ కూటమి ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి. ఆస్ట్రేలియా అణు జలాంతర్గాముల తయారీకి సహకారం అందించడం, అణు నిరాయుధీకరణకు వ్యతిరేకమని చెప్పాయి. ఇదిలా ఉంటే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంచాలనే లక్ష్యంతోనే కూటమిగా ఏర్పడినట్లు ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్  స్పష్టం చేశాయి. 

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు ముకుతాడు వేసేందుకు స్క్వాడ్‌కు అదనంగా ఏర్పాటైన ఆకస్‌ కూటిమిపై చైనా, ఫ్రాన్స్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కూటమి ఏర్పాటును తీవ్రంగా విమర్శించిన చైనా, ఆకస్‌ ఒప్పందాన్ని ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా అంతర్జాతీయ అణు నిరాయుధీకరణ చర్యలకు విఘాతంగా అభివర్ణించింది. కూటమి చర్యలు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని చైనా విమర్శించింది. ఆస్ట్రేలియా అణ్వాయుధ దేశం కాదని, ఇప్పుడు అణు జలాంతర్గామి తయారుచేయడానికి సిద్ధపడుతోందని తెలిపింది. ఇది అణు నిరాయుధీకరణ లక్ష్యాన్ని దెబ్బతీస్తోందని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. ఆయుధాల కొనుగోళ్లు పెరుగుతాయని పేర్కొంది. చైనా ఎదురుదాడిలో చనిపోయేది ఆస్ట్రేలియా సైనికులేనని చైనా ప్రభుత్వానికి చెందిన గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొంది. ఆకస్‌ కూటమి ఒప్పందం క్రూరమైన ఏకపక్ష నిర్ణయమని ఫ్రాన్స్ ఆరోపించింది. ఈ నిర్ణయంతో వాషింగ్టన్‌లో హాజరవ్వాల్సి ఉన్న ఓ కార్యక్రమాన్ని ఫ్రాన్స్‌ దౌత్యవేత్తలు రద్దు చేసుకున్నారు. 

అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ కలిసి ఆకస్‌ పేరుత్‌ భద్రతా కూటమిగా ఏర్పడ్డాయి. బుధవారం జరిగిన వర్చువల్‌ సమావేశంలో ఆకస్‌ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు మూడు దేశాలు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌, అస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఎక్కడా చైనా పేరును ప్రస్తావించలేదు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో స్థిరత్వం కోసం ఈ మూడు దేశాలు తమ రక్షణ సామర్థ్యాలతో పాటు కృత్రిమ మేథ, సైబర్‌ సెక్యూరిటీ వనరులను పరస్పరం పంచుకోనున్నాయి. అణుశక్తితో నడిచే జలాంతర్గాముల తయారీలో ఆస్ట్రేలియాకు అమెరికా, బ్రిటన్‌లు సాయం చేయనున్నాయి. రక్షణ సంబంధిత, శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక స్థావరాలు, సరఫరా గొలుసులను బలోపేతం చేసేందుకు ఆమోదం తెలిపాయి. కాగా ఆకస్‌ కార్యచరణను 18 నెలలలో రూపొందించనున్నారు. ఆకస్‌ కూటమిపై చైనా విమర్శలను ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ తోసిపుచ్చారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంచాలని ఆస్ట్రేలియా కోరుకుంటోందన్నారు. ఆకస్‌ కూటమి పట్ల సింగపూర్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ సానుకూలంగా స్పందించింది. ఈ ఒప్పందం అమెరికా ఫ్రాన్స్‌ సంబంధాలపై ప్రభావం చూపబోదని అమెరికా తెలిపింది.

ఇండో పసిఫిక్‌లో చైనాకు చెక్‌ పెట్టేందుకే గతంలో క్వాడ్‌ కూటమి ఏర్పడింది. ఇందులో భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు ఉన్నాయి. క్వాడ్రాలేటరల్‌ సెక్యూరిటీ డైలో క్వాడ్‌ సమావేశం ఈ నెల 24 జరగనుంది. క్వాడ్‌ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్‌, జపాని ప్రధాని యోషి హిడే సుగా హాజరు కానున్నారు. కాగా సమావేశానికి వారం రోజుల ముందు అదే లక్ష్యంతో కొత్తగా ఆకస్‌ కూటమిని ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని