
తాజా వార్తలు
‘అంబానీ ఇంటివద్ద వాహనం కేసు’ ఎన్ఐఏకి..
దిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ ఘటనలో దర్యాప్తు బాధ్యతలు తీసుకున్నామని ఎన్ఐఏ అధికారిక ప్రతినిధి సోమవారం వెల్లడించారు. ఆ ఘటనపై మళ్లీ కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. అయితే వాహన యజమాని మన్సుఖ్ హీరేన్ మృతి కేసును మాత్రం ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్) దర్యాప్తు చేయనుంది.
దక్షిణ ముంబయిలోని అంబానీ ఇంటికి సమీపంలో ఫిబ్రవరి 25న జిలెటిన్ స్టిక్స్తో ఉన్న ఓ వాహనాన్ని పోలీసులు కనుగొన్న సంగతి తెలిసిందే. ఆ వాహనంలో 20 జిలిటెన్ స్టిక్స్ ఉండటం కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ వాహనం తనదేనని, వారం రోజుల ముందే అది చోరీకి గురైనట్లు మన్సుఖ్ అనే వ్యక్తి పోలీసులకు చెప్పారు. దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. అనూహ్యంగా ఆయన చనిపోవడం గమనార్హం. గత శుక్రవారం ఠాణేలోని సముద్రపు ఒడ్డున మన్సుఖ్ శవమై కన్పించారు.