17 రాష్ట్రాల్లో ‘0’, 13 రాష్ట్రాల్లో 5లోపే మరణాలు 

తాజా వార్తలు

Published : 13/02/2021 17:41 IST

17 రాష్ట్రాల్లో ‘0’, 13 రాష్ట్రాల్లో 5లోపే మరణాలు 

దిల్లీ: కరోనా మహమ్మారి వలయం నుంచి భారత్‌ నెమ్మదిగా బయటపడుతోంది. వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం.. నిబంధనలు పాటిస్తుండటంతో దేశంలో కొవిడ్‌ వ్యాప్తి కట్టడిలోనే ఉంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక కరోనా మరణం కూడా నమోదుకాలేదు. అంతేగాక, 13 రాష్ట్రాల్లో మరణాలు అయిదు లోపే ఉండటం ఊరటనిస్తోంది. 

తెలంగాణ సహా ఒడిశా, ఝార్ఖండ్‌, పుదుచ్చేరి, చండీగఢ్‌, నాగాలాండ్‌, అసోం, మణిపూర్‌, సిక్కిం, మేఘాలయ, లద్దాఖ్‌, మిజోరం, అండమాన్‌ నికోబార్‌ దీవులు, త్రిపుర, లక్షద్వీప్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, డామన్‌ డయ్యూ - దాద్రా నగర్‌ హవేలీల్లో గడిచిన శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో కరోనా మరణాలు లేవని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మరో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా రోజువారీ మరణాలు 5లోపే ఉన్నాయని తెలిపింది. 

80లక్షలకు చేరువలో టీకా పంపిణీ..

మరోవైపు భారత్‌లో జనవరి 16న ప్రారంభమైన టీకా పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది. ఆ రోజున టీకా తీసుకున్నవారికి నేటి నుంచి రెండో డోసు పంపిణీ చేపట్టారు. శనివారం ఉదయం 8 గంటల నాటికి దేశవ్యాప్తంగా 79,67,647 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 59లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు కాగా.. మిగతావారు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 8.5లక్షల మందికి టీకా అందించినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. 

ఇక గడిచిన 24 గంటల్లో కొత్త మరో 12,143 కరోనా కేసులు బయటపడగా.. కేరళలో అత్యధికంగా 5,397.. మహారాష్ట్రలో 3,670 కొత్త కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో మరో 103 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ మరణాలు అత్యధికంగా మహారాష్ట్రలో చోటుచేసుకున్నాయి. అక్కడ నిన్న 36 మంది వైరస్‌తో మరణించగా.. కేరళలో 18 మంది చనిపోయారు. 

ఇవీ చదవండి..

రికవరీ రేటు 97.32శాతం 

తెలంగాణలో రెండో డోసు వ్యాక్సినేషన్‌ ప్రారంభం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని