దిల్లీలో నాలుగో వేవ్‌.. లాక్‌డౌన్‌ ఆలోచనలేదు!

తాజా వార్తలు

Updated : 02/04/2021 20:01 IST

దిల్లీలో నాలుగో వేవ్‌.. లాక్‌డౌన్‌ ఆలోచనలేదు!

 సీఎం కేజ్రీవాల్‌ వెల్లడి

దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా కేసులు మళ్లీ భారీ సంఖ్యలో నమోదువుతున్నాయి. తాజాగా 3వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటంతో అప్రమత్తమైన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. వైద్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌, ఇతర ఉన్నతాధికారులతో రాజధాని నగరంలో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దిల్లీలో ప్రస్తుతం నాలుగో వేవ్‌ కొనసాగుతోందని చెప్పారు. అందువల్లే మళ్లీ కేసులు పెరుగుతున్నాయన్నారు. అయితే, నగరంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టే ఆలోచనేదీ తమకు లేదని స్పష్టంచేశారు. కరోనాతో నెలకొంటున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ప్రస్తుతానికైతే నగరంలో లాక్‌డౌన్‌ అమలుచేయాలన్న ఆలోచన తమకు లేదన్నారు. భవిష్యత్తులో అవసరమైతే ప్రజలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఎలాంటి ఆంక్షలూ లేకుండా టీకా పంపిణీకి అందరినీ అనుమతించాలని కేజ్రీవాల్‌ కేంద్రాన్ని కోరారు. కేంద్రం అనుమతిస్తే దిల్లీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన టీకా పంపిణీ చేపడుతుందన్నారు. కరోనా నిబంధనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాలుగో వేవ్ ‌నుంచి బయటపడేందుకు మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. గతంలో కరోనా విజృంభణతో పోలిస్తే నాలుగో వేవ్‌తో ముప్పు తక్కువేనన్నారు.

దిల్లీలో గడిచిన 24గంటల్లో 87505 శాంపిల్స్‌ పరీక్షించగా.. 3594మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 2084మంది కోలుకోగా.. 14మంది మరణించారు. ఇప్పటివరకు దిల్లీలో 1,47,41,240 శాంపిల్స్‌ పరీక్షించగా.. 6,68,814మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 6,45,770మంది కోలుకోగా.. 11050మంది మృతిచెందారు. ప్రస్తుతం 11994 క్రియాశీల కేసులు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని