చైనా కంపెనీలపై చర్యలు..వెనక్కి తగ్గిన అమెరికా!

తాజా వార్తలు

Published : 05/01/2021 23:40 IST

చైనా కంపెనీలపై చర్యలు..వెనక్కి తగ్గిన అమెరికా!

న్యూయార్క్‌: అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలు ట్రంప్‌ ప్రభుత్వ హయాంలో మరింత క్షీణించిన విషయం తెలిసిందే. చైనా తీరుపై ఆగ్రహంగా ఉన్న అమెరికా.. చైనా కంపెనీలపై చర్యలకు ఉపక్రమించింది. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్ఛేంజీ నుంచి చైనా టెలికాం కంపెనీలను డీలిస్ట్‌ చేసే ఆర్డర్‌పై ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం చేశారు. అయితే, తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్ఛేంజీ ప్రకటించింది. చైనాకు చెందిన మూడు టెలికాం సంస్థల కంపెనీల షేర్లను స్టాక్‌ ఎక్ఛేంజీ నుంచి తొలగించబోమని.. దీనిపై అమెరికా నియంత్రణ సంస్థలతో తదుపరి సంప్రదింపులు జరుపుతామని పేర్కొంది. అయితే, వెనక్కి తగ్గడానికి గల కారణాలను మాత్రం న్యూయార్క్‌ స్టాక్‌ఎక్ఛేంజీ వెల్లడించలేదు.

చైనా మిలటరీతో సంబంధం ఉందన్న కారణాలతో అక్కడి కంపెనీలపై ట్రంప్‌ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నవంబర్‌ నాటికే దాదాపు 50కిపైగా కంపెనీలపై అమెరికన్లు పెట్టుబడులు పెట్టకుండా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. వీటి ఆదేశాలపై ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం కూడా చేశారు. ఇందులోభాగంగా చైనాకు చెందిన చైనా టెలికాం కార్పొరేషన్, చైనా మొబైల్‌ లిమిటెడ్‌తో పాటు చైనా యూనికామ్‌ హాంగ్‌కాంగ్‌ లిమిటెడ్‌ సంస్థలను NYSE నుంచి తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఈ మధ్యే ప్రకటించింది. ఈ నిర్ణయం వెలుబడిన వెంటనే ఆయా కంపెనీల షేర్లు పతనం కావడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన అమెరికా, ఈమూడు కంపెనీలను తొలగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. న్యూయార్క్‌ ఎక్ఛేంజీ తాజా నిర్ణయంతో చైనా టెలికాం కంపెనీల షేర్లు మరోసారి దూసుకెళ్తున్నాయి.

చైనా ఆగ్రహం..
తమ దేశానికి చెందిన కంపెనీలపై అమెరికా చర్యలు తీసుకోవడంపై చైనా ఇదివరకే ఆగ్రహం వ్యక్తంచేసింది. కేవలం కక్ష పూరితంగానే ట్రంప్ ప్రభుత్వం చైనా సంస్థలను అణచివేస్తోందని విమర్శించింది. అమెరికా నిర్ణయం కేవలం ఆ ఒక్క దేశ కంపెనీలపైనే కాకుండా యావత్‌ ప్రపంచంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడింది. 
ఇదిలా ఉంటే, గతకొద్ది కాలంగా చైనాపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వాణిజ్య విధానం, మానవహక్కుల ఉల్లంఘన, ఇతరదేశాలపై గూఢచర్యం, సమాచార తస్కరణ వంటి అంశాలపై తీవ్ర ఆరోపణలను చైనా ఎదుర్కొంటోంది. వీటితోపాటు అమెరికా సాంకేతికత, పెట్టుబడులతో చైనా సైన్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తోందని అమెరికా విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్‌ ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారనే విషయంపై ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.

ఇవీ చదవండి..
అమెరికా బ్లాక్‌ లిస్ట్‌లో మరిన్ని చైనా కంపెనీలు..!
పోతూ..పోతూ..నిషేధం విధిస్తూ!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని