
తాజా వార్తలు
కరోనా కట్టడికి యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
లఖ్నవూ: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, మార్కెట్లను మూసివేయాలని నిర్ణయించింది. బ్యాంకులు, పరిశ్రమలు మాత్రం యథావిధిగా నడుస్తాయని తెలిపింది. ఈ మేరకు హోంశాఖ అదనపు కార్యదర్శి అవనీష్ కే అవస్తీ ఆదివారం ప్రకటించారు. అత్యవసర సరకుల రవాణా, పరిశ్రమల్లో ఉత్పత్తి వంటి ఇతర ఆర్థిక కార్యాకలాపాలకు ఎలాంటి అవాంతరాలు ఉండవని స్పష్టం చేశారు. అలాగే వారాంతాల్లో సామాజిక కార్యకలాపాలపై కఠిన ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఆ సమయంలో శానిటైజేషన్ వంటి పారిశుద్ధ్య పనులు జరుగుతాయన్నారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాయాలు వారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే పనిచేస్తాయన్నారు.
ప్రభుత్వ తాజా నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్లో 55 గంటల మినీ లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇది సోమవారం ఉదయం 5 గంటలతో ముగియనుంది.
ఉత్తర్ప్రదేశ్లో శనివారం కొత్తగా 1392 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 35,092కు చేరింది. అలాగే మరణాల సంఖ్య 913కు ఎగబాకింది.