close

తాజా వార్తలు

Published : 22/04/2021 00:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యాక్సిన్ల బహిరంగ విక్రయం గందరగోళమే!

కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి

దిల్లీ: వ్యాక్సిన్‌ కొనుగోళ్లకు రాష్ట్రాలకు స్వేచ్ఛనిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు తప్పుబట్టారు. కేంద్రం నిర్ణయం వల్ల వ్యాక్సిన్‌ పంపిణీ విషయంలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని ఆమె హెచ్చరించారు. దేశానికి సరిపడా వ్యాక్సిన్ల ఉత్పత్తి కాకముందే కేంద్రం ఇలా వ్యవహరించడాన్ని ఆమె ఆక్షేపించారు. ఈ మేరకు గత కొన్ని రోజులుగా ఆమె వరుస ట్వీట్లతో తన అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ‘‘  కేంద్రం తన భారాన్ని దించుకొని, రాష్ట్రాల మీదికి నెట్టేసింది. ఫలితంగా మే 1 నుంచి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. కేంద్రం తన ప్రాథమిక విధి నుంచి ఇలా తప్పుకోవడం ఎప్పుడూ చూడలేదు’’ అని పేర్కొన్నారు. 

‘‘ వ్యాక్సిన్‌ కొనుగోలు విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వడం అంత మంచిది కాదు. ఈ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించాలి. లేందంటే దేశవ్యాప్తంగా గందరగోళం తలెత్తుతుంది’’ అంటూ సుజాతారావు ట్వీట్‌ చేశారు. అయితే 18 ఏళ్లకు పైబడిన వారందరూ వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అనుమతివ్వడాన్ని ఆమె స్వాగతించారు. ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్‌ పంపిణీ జరగాలన్నారు. కొన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ తయారీదారుల నుంచి నేరుగా కొనుగోలు చేసే సామర్థ్యం ఉండదని, అలాంటి సమయంలో ప్రజలు ఇబ్బందులకు గురవుతారని ఆమె అభిప్రాయపడ్డారు. నాణ్యత విషయంలోనూ సమస్యలు తలెత్తే ప్రమాదముందని అన్నారు. అంతేకాకుండా బహిరంగ మార్కెట్‌ వ్యాక్సిన్‌ ధర అమాంతం పెరిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆమె హెచ్చరించారు.

కేవలం సుజాతారావు మాత్రమే కాదు.. పలువురు ప్రముఖులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయం తీసుకున్న రోజునే ‘దేశ ప్రజలకు వ్యాక్సిన్‌ ఇచ్చే బాధ్యత నుంచి కేంద్రం సులువుగా తప్పించుకుంది’ అంటూ కేరళ ఆర్థిక శాఖ మంత్రి థామస్‌ ఇజాక్‌ ట్వీట్‌ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ నూతన విధానాలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 50 శాతం కేంద్రానికి ఇచ్చి.. మిగతా 50 శాతం వ్యాక్సిన్లను రాష్ట్రాలకు విక్రయించుకోవచ్చని కేంద్రం వ్యాక్సిన్‌ తయారీ దారులకు చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులు అవసరం మేరకు విదేశీ వ్యాక్సిన్లను కూడా కొనుగోలు చేయవచ్చని, దీనిపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. దీంతో భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందోనని సామాన్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని