Covid vaccine:రాష్ట్రాలకు మరో 47 లక్షల వ్యాక్సిన్‌ డోసులు
close

తాజా వార్తలు

Published : 15/06/2021 19:45 IST

Covid vaccine:రాష్ట్రాలకు మరో 47 లక్షల వ్యాక్సిన్‌ డోసులు

దిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. మరోవైపు వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1.05 కోట్ల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వచ్చే మూడు రోజుల్లో మరో 47 లక్షలకు పైగా డోసులను రాష్ట్రాలకు పంపనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రాలకు ఉచితంగా 25కోట్లకు పైగా (26,69,14,930) వ్యాక్సిన్‌ డోసులను అందించింది. వాటిలో జూన్‌ 14 వరకు 25,67,21,069 డోసులను (వృధా అయిన వాటితో కలిపి) అందించారు. అవి కాకుండా ప్రస్తుతం 1,05,61,861 వ్యాక్సిన్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రాలకు తోడుగా ఉండేందుకు కేంద్రం వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తోంది. టీకాల ఉత్పత్తి, సరఫరాను పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది. టీకా తీసుకోవడంతో పాటు ప్రజలు కరోనా మార్గదర్శకాలను పాటించేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కరోనా నియంత్రణలో వ్యాక్సిన్‌ పంపిణీ కీలకమని ఆరోగ్య శాఖ పేర్కొంది. టీకా పంపిణీని వేగవంతం చేసేందుకు మూడో దశ వ్యూహాన్ని మే 1 నుంచి కేంద్రం అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రతి నెలా సెంట్రల్‌ డ్రగ్‌ లేబరేటరీ (సీడీఎల్‌) అనుమతించిన వ్యాక్సిన్లలో 50 శాతం తయారీదారుల నుంచి భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. రాష్ట్రాలకు మాత్రం ఇంతకు ముందులానే ఉచితంగా వ్యాక్సిన్లను అందిస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని