టీకా కోసం..2రోజుల్లో 2.4కోట్ల మంది రిజిస్ట్రేషన్‌
close

తాజా వార్తలు

Published : 30/04/2021 15:07 IST

టీకా కోసం..2రోజుల్లో 2.4కోట్ల మంది రిజిస్ట్రేషన్‌

రాష్ట్రాలను వేధిస్తున్న వ్యాక్సిన్‌ల కొరత

దిల్లీ: మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్‌ పంపిణీ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ దశలో 18 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ టీకా ఇస్తామని పేర్కొంది. ఇందుకోసం ఈ నెల 28వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వీలు కల్పించింది. దీంతో గడిచిన రెండు రోజుల్లోనే 2.4కోట్ల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఫేజ్‌ 3లో వ్యాక్సిన్‌ తీసుకునే వారు తప్పకుండా కొవిడ్‌ పోర్టల్‌/యాప్‌లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దీంతో రిజిస్ట్రేషన్‌ ప్రారంభమైన తొలిరోజునే (ఏప్రిల్‌ 28) 1.37కోట్ల మంది నమోదు చేసుకోగా.. ఏప్రిల్‌ 29న మరో 1.04 కోట్ల మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు 15.22కోట్ల డోసుల పంపిణీ పూర్తయినట్లు తెలిపింది. వీటిలో అత్యధికంగా మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే 67శాతం డోసులను అందించారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక పంజాబ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకున్నట్లు వెల్లడించింది.

వేధిస్తున్న వ్యాక్సిన్‌ల కొరత..

మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మూడోదశ వ్యాక్సిన్‌ ప్రక్రియ మొదలుపెట్టాలని కేంద్రం ప్రకటించినప్పటికీ ఇందుకు చాలా రాష్ట్రాలు సిద్ధంగా లేవని తెలుస్తోంది. చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ డోసులు నిండుకుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, ఇప్పటికే చాలా రాష్ట్రాల వ్యాక్సిన్‌ కోసం తయారీ సంస్థల నుంచి ఆర్డర్‌ చేసుకున్నప్పటికీ అవి రాష్ట్రాలకు చేరేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మే 1నుంచి 18ఏళ్ల వయసు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు చాలా రాష్ట్రాల్లో కొంత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే విషయమై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ కూడా ప్రజలకు సూచన చేశారు. మే 1 వ్యాక్సిన్‌ కేంద్రాల ముందు క్యూ కట్టవద్దని అక్కడి ప్రజలకు సూచించారు. వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి రాగానే అపాయింట్‌మెంట్‌ ప్రకారం ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్‌ అందిస్తామని పేర్కొన్నారు.

ఇక ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్‌లను ఉచితంగా అందించింది. కానీ మూడో దశలో భాగంగా ఆయా రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్‌ తయారీ సంస్థల నుంచే ఖరీదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో 18ఏళ్ల వయసుపైబడిన వారికి ఉచితంగానే వ్యాక్సిన్‌ అందిస్తామని పలు రాష్ట్రాలు ప్రకటించాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని