close

తాజా వార్తలు

Published : 12/04/2021 13:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వారంలో.. 9లక్షల కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా ప్రతి 6 కేసుల్లో ఒకటి భారత్‌లోనే

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌.. గతేడాది దేశాన్ని వణికించింది. ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. అనేక రంగాలను ఛిన్నాభిన్నం చేసింది. అయితే 2020 అక్టోబరు తర్వాత కాస్త శాంతించడంతో హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నామంతా..! కానీ, ఆ ఉపశమనం ఎన్నో రోజులు నిలవలేదు. కరోనా తెచ్చిన సంక్షోభం నుంచి తేరుకునేందుకు ప్రయత్నించేలోపే ఇప్పుడు రెట్టింపు శక్తితో మరోసారి పడగవిప్పింది. రెండో దశలో మరింత వేగంగా విరుచుకుపడుతోంది. కేవలం వారం రోజుల్లోనే దేశంలో 9లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవడం వైరస్‌ విజృంభణకు అద్దంపడుతోంది. 

ఆరు రోజులుగా.. నిత్యం లక్షకు పైనే 

ఏప్రిల్‌ 5 నుంచి ఏప్రిల్‌ 11 వరకు.. ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా 9,38,650 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, సగటున రోజుకు 1.34లక్షల కేసులు వెలుగుచూస్తున్నాయి. అంతక్రితం వారంతో పోలిస్తే గతవారం కొత్త కేసుల సంఖ్య 70శాతం పెరగడం గమనార్హం. దేశంలో తొలిసారి ఏప్రిల్‌ 4న రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటింది. ఆ తర్వాత ఏప్రిల్‌ 5 మినహా గత ఆరు రోజులుగా నిత్యం లక్షపైనే కేసులు ఉంటున్నాయి. 

12లక్షలు దాటిన క్రియాశీల కేసులు

రోజువారీ కేసులు నానాటికీ పెరుగుతుండటంతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 12లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12,01,009 క్రియాశీల కేసులున్నాయి. ఏప్రిల్‌ 5 నాటికి 7.41లక్షలుగా ఉన్న యాక్టివ్‌ కేసులు వారం రోజుల్లోనే నాలుగున్నర లక్షలకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనా తొలి దశ తీవ్రంగా ఉన్న గతేడాది సెప్టెంబరులో యాక్టివ్‌ కేసుల సంఖ్య గరిష్ఠంగా 10.17లక్షలకు చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టి.. ఈ ఏడాది ఫిబ్రవరి 11న 1.33లక్షలకు పడిపోయింది. అయితే ఫిబ్రవరి రెండో వారం నుంచి వైరస్‌ మళ్లీ విజృంభించడంతో క్రియాశీల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. 

వెయ్యికి చేరువైన మరణాలు

దేశంలో 24 గంటల్లో మరో 903 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1.70లక్షలు దాటింది. ఒక రోజులో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం గతేడాది అక్టోబరు తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. అంతక్రితం వారంతో పోలిస్తే మరణాల సంఖ్య కూడా 70శాతం పెరగడం కలవరపెడుతోంది. కరోనా తొలి దశ సమయంలో గతేడాది సెప్టెంబరులో అత్యధికంగా 1200ల రోజువారీ మరణాలు నమోదయ్యాయి. 

83శాతం కేసులు 10 రాష్ట్రాల్లో..

రాష్ట్రాల వారీగా మహారాష్ట్రలో వైరస్‌ పరిస్థితి తీవ్రంగా ఉంది. అక్కడ కొంతకాలంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 62వేలకు పైన కేసులు బయటపడ్డాయి. ఇక దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కొత్త కేసుల్లో 83శాతం కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్‌, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌లలో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. 

27 శాతం భారత్‌లోనే..

ప్రపంచవ్యాప్తంగా ఆదివారం 6.32లక్షల కరోనా కేసులు నమోదవ్వగా.. భారత్‌లో ఆ సంఖ్య 1,68,912గా ఉంది. మొత్తం కేసుల్లో ఇది దాదాపు 27శాతానికి సమానం కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా తాజాగా నమోదవుతున్న ప్రతి ఆరు కరోనా కేసుల్లో ఒకటి భారత్‌లోనే ఉండటం ఆందోళనకరం. మొత్తం కేసుల పరంగా బ్రెజిల్‌ను దాటేసి భారత్‌ రెండో స్థానానికి చేరింది. వరల్డో మీటర్‌ గణాంకాల ప్రకారం.. అమెరికాలో అత్యధికంగా 3.19కోట్ల మందికి వైరస్‌ సోకగా.. భారత్‌లో ఆ సంఖ్య 1.35కోట్లుగా ఉంది. బ్రెజిల్‌లో 1.34కోట్ల మంది వైరస్‌ బారినపడ్డారు. 



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని