ప్రతి నిమిషానికి 11 ఆకలి చావులు

తాజా వార్తలు

Updated : 09/07/2021 18:55 IST

ప్రతి నిమిషానికి 11 ఆకలి చావులు

కైరో: అటు కరోనా మహమ్మారి.. ఇటు పర్యావరణ సంక్షోభం.. దీనికి తోడు అంతర్గత యుద్ధాలు.. వెరసి ఆకలి చావులు పెరుగుతున్నాయి. ఎన్నో ప్రాంతాల్లో కరవు కరాళనృత్యం చేస్తూ నిత్యం ఎంతోమందిని బలితీసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 11 మంది ఆకలితో మరణిస్తున్నారు. ఈ మేరకు పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తోన్న ‘ఆక్స్‌ఫామ్‌’ సంస్థ తమ నివేదికలో వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పేదరికం, ఆకలి చావులపై ఈ సంస్థ “The Hunger Virus Multiplies" పేరుతో నివేదిక రూపొందించింది. ప్రస్తుతం 155 మిలియన్ల మంది అత్యంత దారుణమైన ఆహార సంక్షోభ పరిస్థితుల్లో జీవిస్తున్నారని ఆక్స్‌ఫామ్‌ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 20 మిలియన్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇక ఇందులో రెండొంతుల మంది తమ దేశాల్లో నెలకొన్న అంతర్గత సైనిక ఘర్షణల కారణంగా ఆకలితో అలమటిస్తున్నారని నివేదిక తెలిపింది. కరోనా మహమ్మారి కంటే కరవు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయని, కొవిడ్‌ కారణంగా ప్రతి నిమిషానికి ఏడుగురు మరణిస్తుంటే.. ఆకలి ప్రతి నిమిషానికి 11 మందిని పొట్టనబెట్టుకుంటోందని పేర్కొంది.

ఇప్పటికే ప్రకృతి విపత్తులు, కరోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభంతో ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతుంటే.. కొన్ని దేశాల్లో అంతర్గత యుద్ధాలు అక్కడి ప్రజలకు శాపంగా మారుతున్నాయని ఆక్స్‌ఫామ్‌ సీఈవో అబే మాక్సమ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మహమ్మారి పరిస్థితులు ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఖర్చు 51 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఆహార కొరత, పేదరిక నిర్మూలనను ఆపేందుకు ఐక్యరాజ్యసమితి అంచనా వేసిన మొత్తం కంటే ఇది కనీసం ఆరు రెట్లు ఎక్కువని ఆక్స్‌ఫామ్‌ తెలిపింది.

అఫ్గానిస్థాన్‌, ఇథియోపియా, దక్షిణ సూడాన్‌, సిరియా, యెమెన్‌ తదితర దేశాల్లో ఆకలి చావులు ఎక్కువగా ఉంటున్నాయని నివేదిక తెలిపింది. కొన్ని దేశాల్లో ఈ ఆకలి ఆయుధంగా మారుతోందని పేర్కొంది. ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ ఈ అంతర్గత యుద్ధాలను ఆపాలని, అప్పుడే ఆకలి చావులను అరికట్టగలమని ఆక్స్‌ఫామ్‌ అభ్యర్థిస్తోంది. ఇదిలా ఉండగా.. గ్లోబల్‌ వార్మింగ్‌,  ఆర్థిక మాంద్య పరిస్థితుల కారణంగా గత దశాబ్ద కాలంలో ఆహార పదార్థాల ధరలు 40శాతం వరకు పెరిగాయి. ఇది కూడా అనేక మంది ఆకలి పరిస్థితులకు ఓ కారణమవుతోందని నివేదిక తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని