
తాజా వార్తలు
సింగపూర్లో అధికార పార్టీదే విజయం
సింగపూర్: సింగపూర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికార పార్టీ ‘పీపుల్స్ యాక్షన్ పార్టీ(పీఏపీ)’ మరోసారి ఘన విజయం సాధించింది. 61.2 శాతం ఓట్లను సాధించి.. మొత్తం 93 స్థానాలకు గానూ 83 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ప్రతిపక్ష ‘వర్కర్స్ పార్టీ’ పది స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. పీఏపీ విజయంతో లీ హసీన్ లూంగ్ మరోసారి ప్రధాని కానున్నారు. పీఏపీ వ్యవస్థాపకుడు లీ కువాన్ యూ తర్వాత 2004లో లూంగ్ ప్రధాని పదవి చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే, 2015తో పోలిస్తే అధికార పార్టీకి పదిశాతం ఓట్లు తగ్గాయి. శుక్రవారం జరిగిన ఈ ఎన్నికల్లో 2.65 మిలియన్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ ఎన్నికలు జరిగిన దేశాల్లో అతిచిన్న దేశంగా సింగపూర్ నిలిచింది. ఏప్రిల్లో దక్షిణ కొరియాలో, జూన్లో సెర్బియాలో ఎన్నికలు జరిగాయి.
జూన్ 23న పార్లమెంటును రద్దు చేస్తూ ప్రధాని లూంగ్ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ గడువు 2021 జనవరి వరకు ఉండగా.. సుమారు ఆర్నెళ్ల ముందే ఎన్నికలకు వెళ్లడానికి నిర్ణయించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సింగపూర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ఇతర అంశాలు ఎన్నికల్లో తనకు సానుకూలంగా ఉంటాయని భావించి లూంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.