
తాజా వార్తలు
ఫేస్బుక్, ట్విటర్‌కు సమన్లు..
ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్ వ్యక్తిగత సమాచార గోపత్యపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఫేస్బుక్, ట్విటర్ ఎగ్జిక్యూటివ్‌లకు సమన్లు జారీ చేసింది. పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణ, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, డిజిటల్ మాధ్యమాల్లో మహిళత భద్రత వంటి అంశాలపై చర్చించేందుకు జనవరి 21 తేదీన సమావేశం కావాలని అందులో ఆదేశించింది. వాట్సాప్ కొత్త పాలసీపై వివాదం నేపథ్యంలో పార్లమెంటు సమాచార, సాంకేతిక స్టాండింగ్ కమిటీ ఆదివారం సమావేశమయింది. ఇందులో భాగంగా సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచార గోప్యతపై వస్తున్న ఆరోపణలకు ఫేస్బుక్, ట్విటర్ ప్రతినిధులు కమిటీ ముందు హాజరై తమ అభిప్రాయాలు తెలపాలని పేర్కొంది. అంతేకాకుండా కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధుల సాక్ష్యాధారాలపై తదుపరి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.
కొద్ది రోజుల క్రితం ఫిబ్రవరి 8వ తేదీ నుంచి కొత్త విదివిధానాలను అమలు చేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఇందులో భాగంగా వినియోగదారుల సమాచారాన్ని తమ మాతృసంస్థ అయిన ఫేస్‌బుక్‌తో పంచుకుంటోందని వార్తలు వెలువడ్డాయి. వాట్సాప్ కొత్త పాలసీ వ్యక్తిగత సమాచార గోప్యతకు విరుద్ధంగా ఉందని యూజర్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ పలుమార్లు వివరణ ఇచ్చినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. దీంతో తమ కొత్త పాలసీపై వాట్సాప్ వెనక్కి తగ్గింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 8 తేదీ నుంచి అమల్లోకి రానున్న నిబంధనలను మరో మూడు నెలలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే వాట్సాప్‌పై వ్యతిరేకత నేపథ్యంలో యూజర్స్ టెలిగ్రాం, సిగ్నల్ వంటి ఇతర సామాజిక మాధ్యమాలను ఉపయోగించడం ప్రారంభించారు.
ఇవీ చదవండి..
వాట్సాప్ కొత్త పాలసీ.. వారికి మాత్రమేనట..!