జనతా కర్ఫ్యూ: కిక్కిరిసిన రైల్వేస్టేషన్లు
close

తాజా వార్తలు

Published : 14/04/2021 17:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జనతా కర్ఫ్యూ: కిక్కిరిసిన రైల్వేస్టేషన్లు

ముంబయి: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తుండటంతో అక్కడి సర్కారు 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రరాజధాని ముంబయి మహానగరంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ పనులు చేస్తున్న వాళ్లు సొంతూళ్ల బాటపట్టారు. దీంతో నగరంలోని రైల్వేస్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. 

మహారాష్ట్రలో నేటి నుంచి రెండువారాల పాటు లాక్‌డౌన్‌ తరహా కఠిన నిబంధనలు విధిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే మంగళవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వలసకూలీలు సొంతూళ్లకు పయనమవడంతో బుధవారం స్థానిక కుర్లాలోని లోకమాన్య తిలక్‌ టర్మినస్‌ రైల్వేస్టేషన్‌ రద్దీగా మారింది. భారీ సంఖ్యలో ప్రయాణికులు అక్కడకు చేరుకోవడంతో రైల్వే పోలీసులు అదనపు బలగాలను మోహరించాల్సి వచ్చింది. తాజా పరిస్థితులపై కేంద్ర రైల్వే చీఫ్‌ శివాజీ సుతార్‌ మాట్లాడుతూ.. ప్రజలెవరూ కంగారుపడొద్దని తెలిపారు. వైరస్‌ దృష్ట్యా స్టేషన్ల వద్ద గుంపులుగుంపులుగా ఉండొద్దని సూచించారు. టికెట్లు కన్ఫమ్‌ అయినవారు మాత్రమే స్టేషన్లకు రావాలని కోరారు. 

బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఈ కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. జనతా కర్ఫ్యూలో భాగంగా రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ అమలవుతుంది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయట తిరగడానికి వీల్లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. దుకాణాలను, బహిరంగ ప్రదేశాలను మూసివేయనున్నారు. అయితే ఆసుపత్రులు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, ఔషధ దుకాణాలు, వ్యాక్సినేషన్‌ కేంద్రాలు వంటి అత్యవసర సేవలపై ఎలాంటి నిబంధనలు విధించలేదు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని