యువకులకూ రీ-ఇన్‌ఫెక్షన్‌ ముప్పు..!

తాజా వార్తలు

Published : 18/04/2021 22:00 IST

యువకులకూ రీ-ఇన్‌ఫెక్షన్‌ ముప్పు..!

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ సోకిన వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు కొంతకాలం పాటు రక్షణ కల్పిస్తాయని ఇప్పటికే పరిశోధనల్లో వెల్లడైంది. అయితే, ఒకసారి కోలుకున్న తర్వాత వచ్చే యాంటీబాడీలు రీ-ఇన్‌ఫెక్షన్‌ నుంచి పూర్తిగా రక్షించలేవని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా యువకుల్లో రీ-ఇన్‌ఫెక్షన్‌ బారినపడకుండా ఈ యాంటీబాడీలు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించలేవని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు.

కరోనావైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత వారిలో ఉండే యాంటీబాడీలు ఎంతకాలం రక్షణ కల్పిస్తాయనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా అమెరికాలోని ఇకాహన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, నావల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కలిసి 3వేల మంది యువకులపై పరిశోధన జరిపాయి. పరిశోధనలో పాల్గొన్న వారిలో ఇదివరకు కరోనా వైరస్‌ సోకని (సిరోనెగటివ్‌) 2247 మందిలో 50శాతం (1079) మంది కొత్తగా వైరస్ ‌బారినపడ్డారు. వీరితో పోలిస్తే గతంలో పాజిటివ్‌ వచ్చిన (సిరోపాజిటివ్‌) 189 మందిలో 10శాతం(19 మంది) రీ-ఇన్‌ఫెక్షన్‌ బారినపడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో వైరస్‌ సోకిన వారితో పోలిస్తే వైరస్‌ సోకని వారికి ఐదురెట్లు ఎక్కువ ముప్పు పొంచి ఉందని తేల్చారు. అంతేకాకుండా వైరస్‌ నుంచి కోలుకున్న యువకులూ రీ-ఇన్‌ఫెక్షన్‌ బారినపడే ప్రమాదం ఉన్నట్లు కనుగొన్నారు.

పరిశోధనలో భాగంగా మెరైన్‌ విభాగానికి ఎన్నికైన 3249 మంది యువకులను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రాథమిక శిక్షణకు వచ్చిన సమయంలోనే వీరందరికీ ఆర్‌టీపీసీఆర్‌ ద్వారా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు. అనంతరం పాజిటివ్‌ వచ్చిన వారిని(సిరోపాజిటివ్‌), రానివారికి ప్రత్యేకంగా ప్రతివారం పలుదఫాల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2346 మందిపై మే-2020 నుంచి నవంబర్- 2020 మధ్య కాలంలో పలు దఫాల్లో కొవిడ్‌ పరీక్షలను కొనసాగించారు. వీరిలో తొలుత వైరస్‌ సోకిన వారిలో 189 మంది తిరిగి వైరస్‌ బారినపడగా, మిగతా 2247 మందిలో 1098 మందికి తొలిసారి వైరస్‌కు గురయ్యారు.

అందుకే రీ-ఇన్‌ఫెక్షన్‌..!

రెండోసారి కరోనా (రీ-ఇన్‌ఫెక్షన్‌) బారిన ఎందుకు పడుతున్నారన్న కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధన జరపగా.. వారిలో యాంటీబాడీల స్థాయి తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తేల్చారు. వీరిలో వైరస్‌ను తటస్థీకరించే యాంటీబాడీలు తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా తొలిసారి వైరస్‌ బారినపడిన వారితో పోలిస్తే రీ-ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారిలో వైరస్‌ లోడ్‌ కేవలం 10రెట్లు మాత్రమే తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. అందుచేత రీ-ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారినుంచి ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం పొంచి ఉందనే నిర్ధారణకు వచ్చారు. దీనిపై మరింత అధ్యయనం జరపాల్సి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే, రీ-ఇన్‌ఫెక్షన్‌ సోకినవారిలో 84శాతం రోగులతో పాటు తొలిసారి వైరస్‌ బారినపడిన 68శాతం రోగుల్లో కొవిడ్‌ లక్షణాలు కనిపించలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని