
తాజా వార్తలు
ఈ-వాహనాల వైపు ప్రజల చూపు
రాయితీ ఫలాలు అందుకుంటున్న వాహనదారులు
ఈనాడు, హైదరాబాద్: చమురు ధరలు చురుక్కుమంటుండటంతో ప్రజలు ఇప్పుడిప్పుడే విద్యుత్తు వాహనాల వైపు చూస్తున్నారు. వాటిని ప్రోత్సహించేందుకు గత అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ఆవిష్కరించింది. రహదారి పన్ను (రోడ్ ట్యాక్స్), రిజిస్ట్రేషన్ ఫీజులను రాయితీగా ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చిన ఆ రాయితీలకు ప్రజల నుంచి స్పందన లభిస్తోంది. ఛార్జింగ్ సదుపాయాలు చాలినంతగా లేకపోవటంతోపాటు, ధరలు కూడా అధికంగా ఉండటంతో విద్యుత్తు వాహనాల వినియోగం ప్రస్తుతానికి తక్కువగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 178 ఛార్జింగ్ కేంద్రాలను మంజూరు చేసింది. ప్రస్తుతానికి 45 వరకు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని పది మెట్రో స్టేషన్లలో ఛార్జింగ్ సదుపాయం ఉంది. మరో 15 త్వరలో అందుబాటులోకి రానున్నాయి. పూర్తిస్థాయిలో ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి రావటానికి ఒకట్రెండేళ్లు పడుతుందన్నది అధికారుల అంచనా. దేశంలో విద్యుత్తు వాహనాల బ్యాటరీల తయారీ ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో బ్యాటరీ తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది.
కిలోమీటరుకు 70 పైసల లోపే...
పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాటిలో కొన్ని వాహనాలకు కిలోమీటరుకు రూ.4 నుంచి రూ.8 అవుతుందన్నది అంచనా. విద్యుత్తు వాహనమైతే కిలోమీటరుకు 70 పైసల లోపే ఖర్చు అవుతుంది. విద్యుత్తు వాహనాలతో ఆర్థిక భారం గణనీయంగా తగ్గటంతోపాటు కాలుష్యం బెడద కూడా తగ్గుతుంది. 250 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేసే వాహనానికి ఛార్జింగ్ చేసేందుకు పది గంటలకుపైగా పడుతోంది. హైబ్రిడ్ ఛార్జింగ్ కేంద్రాలు కొన్ని ఏర్పాటవుతున్నప్పటికీ తరచూ అలా ఛార్జ్ చేస్తే బ్యాటరీ జీవితకాలం దెబ్బతింటుందన్నది నిపుణుల అభిప్రాయంగా ఉంది. భారతదేశంలో బ్యాటరీల తయారీతోపాటు సామర్థ్యం పెరిగితే ఛార్జింగ్ సమయం తగ్గుతుందన్నది అంచనా.
ధరలూ ఎక్కువే....
విద్యుత్తు వాహనాల ధరలు భారీగానే ఉన్నాయి. సామాన్యులు ఆచితూచి అడుగులు వేసే పరిస్థితి. పెట్రోలుతో నడిచే ద్విచక్ర వాహనంతో పోలిస్తే విద్యుత్తు ద్విచక్ర వాహనం ధరలు రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు ఎక్కువగా ఉన్నాయి. అదే కార్ల ధరలైతే రూ. 5 లక్షలకు పైగా అధికంగా చెల్లించాలి. ప్రస్తుతం ఒకట్రెండు ప్రముఖ బ్రాండ్లకు చెందిన విద్యుత్తు వాహనాలే అందుబాటులో ఉన్నాయి. మిగిలినవన్నీ నూతనంగా మార్కెట్లోకి వచ్చిన కంపెనీలే. విడిపరికరాల నుంచి బ్యాటరీల్లో వినియోగించే రసాయనాల వరకు చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావటం విద్యుత్తు వాహనాల ధరలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణంగా ఉంది.
విడిభాగాలకు వూహానే హబ్
కరోనా పుట్టినిల్లుగా చెబుతున్న చైనాలోని వూహాన్ నగరమే వాహన రంగ విడిభాగాలకూ పెద్ద దిక్కు. బ్యాటరీల్లో వినియోగించే రసాయనాలు కూడా చైనా నుంచే రావాల్సి ఉంది. కరోనాతో అక్కడ పూర్తిస్థాయిలో ఆ పరిశ్రమలు పరికరాలను ఉత్పత్తి చేయలేని పరిస్థితి. విద్యుత్తు వాహనాల పరికరాలు, సర్క్యూట్ల తయారీ ఇప్పుడిప్పుడే అక్కడ పుంజుకుంటోందని హైదరాబాద్‌లోని వాహన విక్రయాల సంస్థ ప్రతినిధి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. విద్యుత్తు వాహనాలకు అవసరమైన పరికరాలు పూర్తిస్థాయిలో అందుబాటులో వచ్చేందుకు ఒకట్రెండేళ్లు పడుతుందని చెప్పారు. విద్యుత్తు వాహన వినియోగం వేగం పుంజుకునేందుకు మరో అయిదారేళ్లు పడుతుందన్నారు. ఛార్జింగ్ సదుపాయాలు లేకపోవటంతో విద్యుత్తు వాహన కొనుగోలును వాయిదా వేసుకుంటున్నట్లు 77 శాతం మంది ఓ కార్ల విక్రయ సంస్థ నిర్వహించిన సర్వేలో చెప్పారు. భవిష్యత్తులో విద్యుత్తు వాహనం కొనడానికి 35 శాతం మంది ఆసక్తి చూపినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఛార్జింగ్ సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం నడుం బిగించాల్సిన అవసరం ఉంది.
• పూర్తిస్థాయిలో ఛార్జింగ్ సదుపాయాలు లేకపోవటం.
• ఛార్జింగ్ చేసేందుకు అధిక సమయం పడుతుండటం.
• దూర ప్రయాణాలకు అనుకూలంగా లేకపోవటం.
• మరమ్మతులకు గురైతే విడిభాగాల లభ్యత అంతగా లేకపోవటం.
• వాహనాలు మరమ్మతులు చేసేందుకు నిపుణులైన మెకానిక్‌లు పూర్తిస్థాయిలో లేకపోవటం.
రాష్ట్ర ప్రభుత్వ రాయితీలను వినియోగించుకున్నవిద్యుత్తు వాహనాల వివరాలు
• నెల రోజుల వ్యవధిలో రిజిస్టర్
• అయిన వాహనాలు - 605
• రహదారి పన్ను మినహాయింపు
• మొత్తం - రూ. 36.89 లక్షలు
-•రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మినహాయింపు
మొత్తం - రూ. 3.55 లక్షలు