Pfizer: బూస్టర్‌ డోసు వినియోగానికి ఫైజర్ దరఖాస్తు!

తాజా వార్తలు

Published : 09/07/2021 23:40 IST

Pfizer: బూస్టర్‌ డోసు వినియోగానికి ఫైజర్ దరఖాస్తు!

వాషింగ్టన్‌: కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్ ఓ కీలక పరిణామానికి శ్రీకారం చుట్టబోతోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రెండు డోసులుగా మాత్రమే ఉన్న టీకాకు బూస్టర్ డోసును కూడా దాదాపు తప్పనిసరి చేసే దిశగా పావులు కదుపుతోంది. ఈ మేరకు వారు రూపొందించిన బూస్టర్‌ డోసు అత్యవసర అనుమతి కోసం త్వరలో అమెరికాలోని ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ)కు దరఖాస్తు చేసుకునేందుకు సమాయత్తమవుతోంది.

బూస్టర్ డోసుకు సంబంధించిన క్లినికల్‌ పరీక్షల్లో ఆశాజనక ఫలితాలు వెల్లడైనట్లు సంస్థ పేర్కొంది. తొలుత రూపొందించిన టీకాతో పోలిస్తే మూడో డోసు వల్ల వైరస్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలు ఐదు నుంచి 10 రెట్లు అధికంగా ఉత్పత్తయినట్లు గుర్తించామని ఫైజర్‌ పరిశోధనా విభాగాధిపతి మైకేల్‌ డోల్‌స్టెన్ తెలిపారు. వీటి ఆధారంగానే బూస్టర్ డోసు అనుమతి కోరనున్నట్లు వెల్లడించారు. ఇతర దేశాల ఔషధ నియంత్రణా సంస్థలతోనూ చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా రకాలు.. ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరంగా  మారిన డెల్టా వేరియంట్‌పై బూస్టర్ డోసు సమర్థంగా పనిచేస్తున్నట్లు ఫలితాలు సూచిస్తున్నట్లు వివరించారు. అయితే, బూస్టర్ డోసు ప్రయోగాల్లో కేవలం 10-20 మంది మాత్రమే పాల్గొన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో జరిపే ప్రయోగాల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం అయ్యే సూచనలు మెరుగ్గా ఉన్నట్లు డోల్‌స్టెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు అమెరికా సీడీసీ, ఎఫ్‌డీఏ.. ఫైజర్‌ తాజా వార్తకు పూర్తిగా భిన్నమైన ప్రకటన చేశాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బూస్టర్‌ డోసులు అవసరం లేదని ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు సురక్షితమైనవేనని తెలిపాయి. బూస్టర్ డోసుకు సంబంధించి ఆచితూచి వ్యవహరిస్తామని స్పష్టం చేశాయి. పూర్తిస్థాయి వ్యాక్సిన్ తీసుకున్న అమెరికన్లు ఇప్పుడే బూస్టర్‌ డోసు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపాయి. మూడో డోసు అవసరమని శాస్త్రీయంగా నిరూపితమైనప్పుడు.. వాటిని అందించేందుకు సిద్ధంగానే ఉన్నామని పేర్కొన్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని