Kejriwal: పిల్లల కోసం టీకాకు అనుమతివ్వండి

తాజా వార్తలు

Updated : 27/05/2021 15:13 IST

Kejriwal: పిల్లల కోసం టీకాకు అనుమతివ్వండి

దిల్లీ: చిన్నారులకు టీకాలు వేసేందుకు ఫైజర్ కొవిడ్‌ టీకా సేకరణను వేగవంతం చేయాలని గురువారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ కేంద్రానికి సూచించారు. ఫాస్ట్ ట్రాక్ విధానంలో తమ టీకాకు అనుమతులు మంజూరు చేయాలంటూ ఫైజర్‌ సంస్థ కోరిన నేపథ్యంలో..గురువారం కేజ్రీవాల్ ఈ విజ్ఞప్తి చేశారు. 

‘మన చిన్నారుల కోసం సాధ్యమైనంత త్వరగా ఈ టీకాను మనం సేకరించాలి’ అని కేజ్రీవాల్ ట్వీట్‌ చేస్తూ..ఫైజర్‌పై మీడియాలో వచ్చిన కథనాన్ని జోడించారు. రానున్న రోజుల్లో కరోనా మూడో దశ చిన్నారులపై ప్రభావం చూపుతుందనే కథనాలను ఉటంకిస్తూ..వారి కోసం టీకాను అందుబాటులోకి తేవాలని కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కోరుతున్నారు. అలాగే కరోనా రెండోదశ కారణంగా ఆలస్యమైన 12వ తరగతి బోర్డు పరీక్షలను నిర్వహించాలని భావిస్తే..విద్యార్థులు, ఉపాధ్యాయులకు టీకాలు ఇవ్వాలని కూడా ఆయన సూచించారు. ఇప్పటికే భారత్‌లో అత్యవసర వినియోగం కింద కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్‌-వి టీకాలకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. చిన్నారులపై మాత్రం వాటిలో ఏ టీకాను పరీక్షించలేదు. అయితే 2-18 సంవత్సరాల వయస్సువారిపై జూన్‌ నుంచి రెండు, మూడు దశ ప్రయోగాలు నిర్వహించనున్నట్లు ఇటీవల భారత్‌ బయోటెక్ తెలిపింది. 

12ఏళ్లు దాటిన వారికి మా టీకా సురక్షితం..

కొవిడ్ వైరస్ ఉత్పరివర్తనాలపై తమ టీకా అత్యంత ప్రభావంతంగా పనిచేస్తుందని అమెరికాకు చెందిన ఔషధ దిగ్గజ సంస్థ ఫైజర్ కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. అలాగే 12ఏళ్లు దాటిన వారందరికీ ఇది సురక్షితమని వెల్లడించింది. అంతేకాకుండా భారత్‌లో ఉన్న రకాలన్నింటిని ఇది అడ్డుకోగలదని చెప్పింది. ఫాస్ట్ ట్రాక్ విధానంలో అనుమతులు మంజూరు చేసినట్లయితే జులై-అక్టోబర్ మధ్య 5 కోట్ల టీకా డోసులు సరఫరా చేయగలమని ప్రభుత్వానికి వివరించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ..ఓ మీడియా సంస్థ వెల్లడించింది. అలాగే తమ టీకాను నెల రోజుల పాటు 2-8 డిగ్రీల వద్ద భద్రపరచవచ్చని కూడా తెలిపింది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని