
తాజా వార్తలు
భారత్లో రష్యా టీకా మూడో దశ ప్రయోగాలు మొదలు..
ఆగ్రా: రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వి’ మూడోదశ క్లినికల్ ప్రయోగాలు ఆగ్రాలో ప్రారంభమయ్యాయి. ఇవి నగరంలోని ఎస్.ఎన్. మెడికల్ కాలేజ్లో పదిరోజుల పాటు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ క్లినికల్ ప్రయోగాలు నిర్వహించేందుకు ఆరోగ్యవంతులైన సుమారు వంద మందిని వాలెంటీర్లుగా ఎంపిక చేస్తామని ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే దీనికోసం 46 మంది పేర్లు నమోదు చేసుకున్నారని.. తొలిరోజు ప్రయోగాల్లో భాగంగా వారిలో ఎనిమంది మందికి టీకా ఇచ్చినట్టు వివరించారు.
స్పుత్నిక్ టీకా రెండో దశ క్లినికల్ పరీక్షలను కూడా మన దేశంలోనే నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటిలో సంతృప్తికర ఫలితాలు వచ్చినట్టు ప్రయోగాలు నిర్వహిస్తున్న డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ వెల్లడించింది. తదనంతరం ఈ టీకా మూడోదశ ప్రయోగాలకు కూడా భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి లభించింది. కాగా, అరవై ఏళ్లకు పైబడిన వ్యక్తులపై జరిపిన క్లినికల్ ప్రయోగాల్లో.. 91.8శాతం ప్రభావం కనిపించినట్టు.. ఇటీవలి క్లినికల్ రిపోర్టులో వెల్లడయ్యింది.
ఇవీ చదవండి..
స్పుత్నిక్ వీ మూడో దశ క్లినికల్ పరీక్షలు
స్పుత్నిక్ టీకా ఎంతమంది తీసుకున్నారంటే..