close

తాజా వార్తలు

Updated : 13/07/2020 16:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాంగ్రెస్‌లో అగ్గిరాజేసిన కాల్‌ ట్యాపింగ్‌...!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

జ్యోతిరాదిత్య సింధియా.. సచిన్‌ పైలట్‌.. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొత్త తరం కాంగ్రెస్‌లో శక్తివంతమైన నాయకులుగా చలామణి అయ్యారు. వీరిద్దరి తండ్రులదీ హఠాన్మరణమే. ఇద్దరూ తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చినవారే. కాంగ్రెస్‌లోని ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన ఉక్కపోతను ఎదుర్కొన్నవారే. వీరిలో సింధియా కొన్ని నెలల క్రితం పార్టీని వీడి కాషాయం కండువా కప్పుకోగా.. ఈ పరిణామంతో మధ్యప్రదేశంలో అధికార మార్పిడి చోటు చేసుకొంది. ఇప్పుడు సచిన్‌ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకొన్నారు. దీంతో రాజస్థానంలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. 

ఫోన్‌ ట్యాపింగే ట్రిగర్‌ పాయింట్‌..!

జూన్‌13న రాజస్థాన్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ అధికారులు ఓ ఫోన్‌ను ట్యాప్‌ చేశారు. దీనిలో ఇద్దరు వ్యక్తులు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసే అంశాన్ని, ఎమ్మెల్యేల  కొనుగోలు తదితర విషయాలను చర్చించారు. వీరిపేర్లను ఎస్‌వోజీ అధికారులు బయటకు వెల్లడించలేదు. దీనికి సంబంధించి జులై10 తేదీన ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఫోన్‌ సంభాషణలో కైలాష్‌గర్హ్‌ ఎమ్మెల్యే  రమిలా ఖదియా, మహేంద్రసింగ్‌ మాల్వీ ప్రస్తావనవచ్చినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.  దీనిలో ప్రస్తుత ఉపముఖ్యమంత్రిని కేంద్రమంత్రి చేస్తారనే ప్రస్తావన ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అశోక్‌ సింగ్‌, భరత్‌ మలానీ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.  మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి వాంగ్మూలం నమోదు చేసేందుకు ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్లను ఎస్‌వోజీ సమయం కోరింది.  మరోపక్క ఈ దర్యాప్తు మొత్తం తమను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్నట్లు పైలట్‌ వర్గం భావిస్తోంది. దీంతో 12వ తేదీన సచిన్‌ తన వర్గంతో దిల్లీకి  వెళ్లారు. 

ఆది నుంచి మనస్పర్థలే..

* 2013లో రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ఓడిపోయాక సచిన్‌ పైలట్‌ పార్టీని నడిపించారు. 2018లో అభ్యర్థుల ఎంపిక నుంచి వివాదం నడిచింది. అప్పట్లో అశోక్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం సచిన్‌ పైలెట్‌కు నచ్చలేదు. కానీ, అధిష్ఠానం బుజ్జగించడంతో ఆయన సర్దుకుపోక తప్పలేదు. 

* మంత్రివర్గ కేటాయింపుల సమయంలో కూడా సచిన్‌కు అసంతృప్తి మిగిలింది. కీలకమైన హోం, ఫైనాన్స్‌ శాఖలు గహ్లోత్‌ వర్గానికి వెళ్లాయి. ఈ విషయంలో ఇరు వర్గాలను రాజీచేయడానికి స్వయంగా రాహుల్‌గాంధీ రంగంలోకి దిగాల్సి వచ్చింది.  మొత్తం తొమ్మిది శాఖలు గహ్లోత్‌ వర్గానికి దక్కాయి. 

*  ఇక 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో వీరి విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి.  అశోక్‌ గహ్లోత్‌ పార్టీని పట్టించుకోలేదని పైలట్‌ వర్గం విమర్శించింది. ఆయన కేవలం జోధ్‌పూర్‌కు మాత్రమే పరిమితం అయ్యారని పేర్కొంది. ఈ క్రమంలో అశోక్‌ కుమారుడు ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన గెలుపునకు సచిన్‌ వర్గం సహకరించలేదని గహ్లోత్‌ భావించారు. 

* 2019 డిసెంబర్లో ఏడాది పాలన సందర్భంగా ప్రస్తావించిన ప్రభుత్వ విజయాల్లో సచిన్‌కు సంబంధించిన శాఖలవి లేవు. దీంతో  ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

* ఇటీవల రాజ్యసభ ఎన్నికల సమయంలో అశోక్‌గహ్లోత్‌ చేసిన ప్రకటనలను పూర్తి విరుద్ధంగా సచిన్‌  ప్రకటన ఉంది. ఈ ఘటనతో మారోసారి ఇద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. చివరికి ఇవి ముదిరిపోయి సచిన్‌ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యే పరిస్థితి నెలకొంది.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని