Corona: వైరస్ వేచి ఉండదు..

తాజా వార్తలు

Published : 07/07/2021 01:26 IST

Corona: వైరస్ వేచి ఉండదు..

ఆందోళన వ్యక్తం చేసిన ఆరోగ్య శాఖ

రెండో ముప్పు ఇంకా తొలగిపోలేదు

దిల్లీ: కరోనా రెండోదఫా ముప్పు పూర్తిస్థాయిలో తొలగిపోలేదని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పరిమిత స్థాయిలో దాని ప్రభావం కొనసాగుతోందని హెచ్చరించింది. నిబంధనల ఉల్లంఘన.. కొవిడ్‌పై చేసిన పోరాట ఫలితాన్ని తుడిచేస్తుందని స్పష్టం చేసింది. 

మనాలి అక్కడే ఉంటుంది..వైరస్ వేచి ఉండదు..

ఉత్తర భారతంలో కొనసాగుతున్న హీట్ వేవ్‌ కారణంగా ప్రజలు చల్లని ప్రాంతాల్లో సేదతీరేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతాల్లో జనం గుమిగూడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించకపోవడంపై నెట్టింట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వీటి గురించి ఆరోగ్య శాఖ ప్రస్తావించింది. ‘ఈ వైఖరి భయానికి గురిచేస్తోంది. ప్రజలంతా కొవిడ్ నియమావళికి లోబడి ప్రవర్తించాలి’ అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘మనాలి అక్కడే వేచి ఉంటుంది.. కానీ వైరస్‌ అలా కాదు. మీతో పాటు మీ చుట్టుపక్కల వారిని సురక్షితంగా ఉంచేందుకు రెండు గజాల దూరాన్ని పాటించాలి’ అంటూ ట్వీట్ చేసింది. 

80 శాతం కేసులు 90 జిల్లాల్లోనే..
దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కరోనా కేసుల్లో 80 శాతం కేసులు 90 జిల్లాల్లోనే వెలుగుచూస్తున్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, తమిళనాడులోని 15 జిల్లాల్లో వైరస్ విజృంభణ అధికంగా ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రెండు రోజులుగా 40 వేలకు దిగువనే కొత్తకేసులు బయటపడుతున్నాయి. నిన్న 34,703 మందికి కరోనా సోకింది. మరణాలు మూడు నెలల కనిష్టానికి చేరాయి. తాజాగా 553 మంది ప్రాణాలు కోల్పోయారు. 4.6 లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. 

టీకా పంపిణీలో అమెరికా కంటే వేగంగా..
మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఈ రోజు నాటికి 35.75 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. 171 రోజుల్లో ఈ భారత్ ఈ మార్కును చేరుకుంది. 33.06 కోట్ల డోసులను వేసేందుకు అమెరికాకు 204 రోజులు పట్టింది. బ్రిటన్ విషయానికి వస్తే..7.89 కోట్ల డోసులను పంపిణీ చేసేందుకు 210 రోజులు తీసుకుందని వెల్లడించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని