ప్రాథమిక స్థాయిలోనే ప్లాస్మా చికిత్స 

తాజా వార్తలు

Published : 19/11/2020 14:30 IST

ప్రాథమిక స్థాయిలోనే ప్లాస్మా చికిత్స 

3 - 7 రోజుల మధ్య దీనిని అందించాలి 
రోగం ముదిరినవారికి వద్దు  
10 రోజుల తర్వాత ప్రయోజనం ఉండదు: ఐసీఎంఆర్‌ 

కొవిడ్‌ రోగ తీవ్రత ముదిరిన వారికి దాన్ని తగ్గించడంలో కానీ, మరణాలను నియంత్రించడంలో కానీ ప్లాస్మా థెరపీ ఎలాంటి ప్రభావం చూపలేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) స్పష్టంచేసింది. ఈ థెరపీ ప్రభావాన్ని పరిశీలించడానికి ప్రపంచంలో అతిపెద్ద ప్రయోగం చేసిన ఐసీఎంఆర్‌ ఆ ఫలితాలను వెల్లడించింది. కరోనా తీవ్రత ప్రాథమిక స్థాయిలో ఉన్నవారికి తొలి 3-7 రోజుల్లోనే యాంటీబాడీలు అధికంగా ఉన్న ప్లాస్మాను ఎక్కించాలని, పది రోజుల తర్వాత ప్లాస్మా థెరపీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టంచేసింది. 
చైనా, నెదర్లాండ్స్‌లోనూ ఇదే రుజువైంది 
‘‘ప్లాస్మాలో కేంద్రీకృతమైన ప్రత్యేక ప్రతి రక్షకాలను (యాంటీబాడీస్‌) బట్టి ఆరోగ్య పరిస్థితుల మెరుగుదల, రోగ తీవ్రత, ఆసుపత్రిలో ఉండాల్సిన రోజుల తగ్గుదల, మరణాల నియంత్రణలాంటి ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. ప్లాస్మా ప్రయోజనాలను తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా 39 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా తీవ్రత ఓ మోస్తరుగా ఉన్న రోగులపై మేం ప్రయోగాలు నిర్వహించాం. రోగ తీవ్రత పెరుగుదలను నియంత్రించడంలో, మరణాలను తగ్గించడంలో ప్లాస్మా ఏమాత్రం ఉపయోగపడలేదు. కొవిడ్‌ తీవ్రత ఓ మోస్తరుగా ఉన్న 464 మంది రోగులపై చేసిన ప్రయోగాల్లో ప్లాస్మా ప్రయోజనాలేవీ కనిపించలేదు. చైనా, నెదర్లాండ్స్‌లో నిర్వహించిన ఇదే తరహా పరిశోధనల్లోనూ పెద్ద ప్రయోజనాలేమీ నిరూపితం కాలేదు. అందువల్ల విచక్షణ రహితంగా ఈ థెరపీ చేయడం మంచిదికాదు. యాంటీబాడీలు ఎక్కువ ఉన్న ప్లాస్మాతో పోలిస్తే తక్కువ ఉన్న ప్లాస్మాతో కొవిడ్‌ చికిత్స అందించడంవల్ల తక్కువ ప్రయోజనాలుంటాయన్న భావనకు వచ్చాం. అందుకే ఎక్కువ ప్రతిరక్షకాలున్న దాత నుంచి ప్లాస్మా సేకరించి కొవిడ్‌ చికిత్స కోసం ఉపయోగించడం మంచిది. స్వీకరించే వ్యక్తిలో అప్పటికే కొవిడ్‌-19ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉంటే వారికి మళ్లీ ప్లాస్మా ఎక్కించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇకమీదట ఎక్కడ ప్లాస్మా థెరపీ చేయాలన్నా మేం సూచించిన ప్రత్యేక వర్గం నుంచే ప్లాస్మా సేకరించాలి’’ అని ఐసీఎంఆర్‌ పేర్కొంది.
వీరు ప్లాస్మా దానం చేయొచ్చు
ఎవరు?: పురుషులు, ఇప్పటివరకు గర్భం దాల్చని మహిళలు
వయసు: 18-65 ఏళ్ల మధ్య
శరీర బరువు: 50 కేజీల పైన
అర్హత: కొవిడ్‌-19 ఆర్‌టీ-పీసీఆర్‌ పాజిటివ్‌
ఎప్పుడు ఇవ్వాలి?: కొవిడ్‌ లక్షణాలు కనిపించిన 14 రోజుల తర్వాత (కొవిడ్‌-19 నెగెటివ్‌ ధ్రువీకరణ తప్పనిసరి కాదు)
ఎవరినుంచి తీసుకోకూడదు?: హెచ్‌ఐవీ, హెచ్‌బీవీ, హెచ్‌సీవీ ఉన్నవారి నుంచి
ప్రయోగం ఎలా
ఎవరికి?: కొవిడ్‌-19 ప్రాథమిక స్థాయిలో ఉన్న వారికి
ఎన్ని రోజుల్లోపు?: లక్షణాలు కనిపించిన 3-7 రోజుల్లో అందించాలి. 10 రోజుల తర్వాత ఇవ్వకూడదు
అర్హత?: కొవిడ్‌-19కి వ్యతిరేకంగా పోరాడే ఐజీజీ యాంటీబాడీలు లేనివారికి మాత్రమే 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని