
తాజా వార్తలు
ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టిక్కెట్ ధర ₹50
ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ మరోసారి కొనసాగుతున్న వేళ జనం రద్దీ నియంత్రించే పేరుతో సెంట్రల్ రైల్వే అధికారులు ప్లాట్ఫాం టిక్కెట్ ధరల్ని భారీగా పెంచారు. ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లోని కొన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టిక్కెట్ ధరను రూ.10 నుంచి ఏకంగా రూ.50లు చేసినట్టు ప్రకటించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని జనం అధిక రద్దీని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, దాదర్, లోక్మాన్య తిలక్ టెర్మినస్తో పాటు పొరుగున ఉన్న ఠానే, కల్యాణ్, పాన్వెల్, భీవాండీ రోడ్ స్టేషన్లలో పెంచిన ఈ ధరలు అమలు చేయనున్నట్టు సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో శివాజీ సుతార్ వెల్లడించారు.
పెంచిన ప్లాట్ఫాం టిక్కెట్ ధరలు మార్చి 1 నుంచి జూన్ 15 వరకు అమలులో ఉంటాయని ఆయన స్పష్టంచేశారు. వేసవిలో ప్రయాణాల సందర్భంగా ఆయా స్టేషన్ల వద్ద అధిక రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మరోవైపు, ఫిబ్రవరి రెండో వారం నుంచి మహారాష్ట్రలో రోజువారీ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ముంబయి మహానగరంలో ఇప్పటిదాకా 3.25 లక్షల కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 11,400 మంది మరణించారు.