ఆ తల్లి నిర్ణయం.. మోదీని మెప్పించింది
close

తాజా వార్తలు

Published : 16/06/2021 17:30 IST

ఆ తల్లి నిర్ణయం.. మోదీని మెప్పించింది

దిల్లీ: కరోనా బారిన పడిన ఓ తల్లి తన ఆరేళ్ల కొడుకు కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆమె నుంచి చిన్నారికి వైరస్‌ సోకకుండా ఉండేందుకు తల్లీకొడుకులిద్దరూ వేర్వేరు గదుల్లో ఒంటరిగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని ఆ తల్లిని అభినందించారు. క్లిష్ట పరిస్థితుల్లో చాలా ధైర్యంగా, సానుకూల దృక్పథంతో వ్యహరించి వైరస్‌ను జయించారని కొనియాడారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన పూజా వర్మ తన భర్త గగన్‌ కౌశిక్‌, ఆరేళ్ల కుమారుడితో కలిసి సెక్టార్‌- 6 ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పూజ, ఆమె భర్త కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమెలో ఆందోళన మొదలైంది. ‘‘ఇంట్లో ఉండేది ముగ్గురం.. మా ఇద్దరికీ కరోనా సోకింది. అందరం కలిసే ఉంటే పిల్లాడికి కూడా వైరస్‌ వ్యాపిస్తుంది. అలా అని మేం వేరుగా ఉంటే బాబును చూసుకునేది ఎవరు..’’ ఇలా రకరకాల ఆలోచనలతో పూజ సతమతమైపోయింది. 

చివరకు పూజ దంపతులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురూ వేర్వేరు గదుల్లో ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే కరోనా అంటే ఏంటో కూడా తెలుసుకోలేని ఆ ఆరేళ్ల చిన్నారి ఒంటరిగా గదిలో ఉండటం అంటే సాధ్యం కాని విషయమే. కానీ అది పూజకు మరో మార్గం కన్పించలేదు. ముగ్గురూ మూడు గదుల్లో ఉండటం ప్రారంభించారు. అయితే చిన్నారి మాత్రం తానేదో తప్పు చేసినందుకే ఇలా ఉంచారని అనుకునేవాడు. ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ వారంతా కరోనా తగ్గేవరకు వేర్వేరుగానే ఉన్నారు.

కరోనా వల్ల తమ ఇంట్లో జరిగిన ఈ పరిణామాలను వివరిస్తూ పూజా వర్మ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. చిన్నారికి దూరంగా ఉంటూ తల్లి పడిన వేదనను కవిత రూపంలో రాసుకొచ్చారు. ఈ లేఖను చదివిన ప్రధాని మోదీ.. ఆమెను అభినందిస్తూ ప్రత్యుత్తరం పంపారు. 

‘‘అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు, మీ కుటుంబం ఎంతో ధైర్యంగా కొవిడ్‌ నిబంధనలను పాటించి వైరస్‌తో పోరాడారు. విపత్కర సమయంలో సహనాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని మన శాస్త్రాలు మనకు నేర్పించాయి. బిడ్డకు దూరంగా ఉన్నప్పుడు తల్లి పడే కంగారు, ఆందోళన మీ కవితలో కన్పించాయి. ఇదే ధైర్యం, సానుకూల దృక్పథంతో మీ జీవితంలో ముందుకు సాగాలని, ఎలాంటి సవాళ్లనైనా విజయవంతంగా ఎదుర్కోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని మోదీ పూజను అభినందిస్తూ లేఖ పంపారు. 

ఐసోలేషన్‌ను పాటించడంతో తమ చిన్నారికి వైరస్‌ సోకలేదని అతడి తండ్రి కౌశిక్‌ తెలిపారు. వైరస్‌ నుంచి తామిద్దరం పూర్తిగా కోలుకున్నామని చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని