యూఎస్‌ ఆహ్వానాన్ని స్వాగతించిన మోదీ!

తాజా వార్తలు

Published : 04/04/2021 02:00 IST

యూఎస్‌ ఆహ్వానాన్ని స్వాగతించిన మోదీ!

దిల్లీ: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ నేతృత్వంలో త్వరలో నిర్వహించనున్న వాతావరణ సదస్సు ఆహ్వానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. బైడెన్‌ ఆహ్వానం మేరకు ఏప్రిల్‌ 22, 23 తేదీల్లో అమెరికాలో వర్చువల్‌గా జరగనున్న దేశాధినేతల సదస్సుకు హాజరయ్యేందుకు ఆయన అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ మీడియా సమావేశంలో వెల్లడించారు.

‘వాతావరణ మార్పులపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు 40 దేశాల అధినేతలను జో బైడెన్‌ సదస్సుకు ఆహ్వానించారు. అందులో భాగంగా ప్రధాని మోదీని సైతం ఆహ్వానించారు.  బైడెన్‌ ఆహ్వానం మేరకు సమావేశానికి హాజరయ్యేందుకు మోదీ అంగీకరించారు’ అని బాగ్చి తెలిపారు. ‘సదస్సు నేపథ్యంలో యూఎస్‌ రాయబారి జాన్‌ కెర్రీ ఏప్రిల్‌ 5-8 తేదీ వరకు దిల్లీ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా వాతావరణ సదస్సు గురించి ఆయన పలువురు కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు’ అని బాగ్చి వివరించారు.

ఈ సదస్సుకు మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సహా ఇతర ముఖ్య నేతలను పిలిచినట్లు శ్వేతసౌధం ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. భూతాపాన్ని 1.5డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసేలా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడమే సదస్సు ముఖ్య ఉద్దేశం అని వెల్లడించింది. నవంబర్‌లో గ్లాస్గోలో జరగబోయే ఐరాస వాతావరణ మార్పుల సదస్సుకు ఇది మైలు రాయిగా నిలుస్తుందని వైట్‌హౌస్‌ పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని