‘విభజించి.. పాలించడం’ కాంగ్రెస్‌ విధానం: మోదీ  

తాజా వార్తలు

Published : 25/02/2021 15:32 IST

‘విభజించి.. పాలించడం’ కాంగ్రెస్‌ విధానం: మోదీ  

పుదుచ్చేరి: కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలో మత్స్య రంగానికి ప్రాధాన్యమిచ్చేలా ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు చేయడం తనకు దిగ్బ్రాంతి కలిగించిందని మోదీ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం పుదుచ్చేరి పర్యటనలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం లాస్పేట్‌లో నిర్వహించిన సభలో మాట్లాడారు. పుదుచ్చేరిలో ఏప్రిల్‌, మేలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 

‘కాంగ్రెస్‌ నేత మత్స్య శాఖ ఏర్పాటు చేస్తానని చేసిన వ్యాఖ్యలతో నేను దిగ్భ్రాంతికి గురయ్యా. నిజమేంటంటే.. కేంద్రంలో ఆ శాఖ ఇప్పటికే ఉంది. ఎన్డీయే ప్రభుత్వం 2019లోనే ఫిషరీస్‌ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది’ అని మోదీ వెల్లడించారు. 

కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ విభజించి, పాలించు అనే విధానాల్ని అనుసరిస్తోంది. పుదుచ్చేరిలో ప్రభుత్వం పడిపోయినందుకు ప్రజలు వేడుక చేసుకుంటున్నారు. ఇక్కడి ప్రజలకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఇక్కడి ప్రభుత్వం సద్వినియోగం చేయలేదు. తీర ప్రాంతంలోని మత్స్యకారుల కోసం చేపట్టిన పథకాలను అమలు చేయలేదు. ప్రజలకు నిజాలు చెప్పాల్సింది పోయి.. సీఎం నారాయణ స్వామి అబద్ధాలు చెబుతున్నారు’ అని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. 

‘‘పుదుచ్చేరిలో 2016 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన పార్టీ తమ అధిష్ఠానానికి సేవ చేసే పనిలో నిమగ్నమైంది. కాంగ్రెస్‌ పార్టీ వారసత్వ రాజకీయాలు చేస్తున్నందు వల్లే ప్రజలు ఆ పార్టీని తిరస్కరిస్తున్నారు. అందుకే వారు పార్లమెంటులో అధిక స్థానాలు సాధించలేకపోతున్నారు. పుదుచ్చేరిలో కోఆపరేటివ్‌ రంగంలో మార్పులు తెచ్చేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భాషే విద్యార్థులకు విద్యనభ్యసించడానికి మంచి పునాది. కాబట్టి దేశంలో స్థానిక భాషలోనే విద్యను అందించే దిశగా కేంద్రం కృషి చేస్తోంది. పుదుచ్చేరిని అద్భుతంగా(బెస్ట్‌) తీర్చిదిద్దాలని ఎన్డీయే భావిస్తోంది.‘B-BEST HUB,E-EDUCATION HUB,S-SPIRITUAL HUB, T-TOURISM HUB’’ అని మోదీ వెల్లడించారు. కేరళ పర్యటనలో భాగంగా బుధవారం కొల్లాం వెళ్లిన కాంగ్రెస్‌ గాంధీ మత్స్య రంగానికి ప్రత్యేకంగా కేంద్రంలో శాఖ ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని