PM modi at UN: ప్రపంచంలోనే తొలిసారి కొవిడ్‌ డీఎన్‌ఏ టీకాను అభివృద్ధి చేసిన ఘనత భారత్‌దే.. ఐరాసలో ప్రధాని మోదీ

తాజా వార్తలు

Updated : 26/09/2021 00:24 IST

PM modi at UN: ప్రపంచంలోనే తొలిసారి కొవిడ్‌ డీఎన్‌ఏ టీకాను అభివృద్ధి చేసిన ఘనత భారత్‌దే.. ఐరాసలో ప్రధాని మోదీ

న్యూయార్క్‌: భారత దేశ అభివృద్ధి ప్రపంచానికి చోదకశక్తిగా మారుతోందని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌ తెచ్చిన సంస్కరణలు ప్రపంచాన్ని మారుస్తాయని చెప్పారు. వైవిధ్యమే భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలంగా మార్చిందన్నారు. ప్రజాస్వామ్యానికి భారత్‌ను మాతగా అభివర్ణించారు. ప్రపంచానికి డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ అందించిన తొలి దేశం భారత్‌ అని మోదీ చెప్పారు. ఈ మేరకు ఐరాసలో సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. 60 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఫ్గాన్‌లోని పరిస్థితులను ప్రస్తావించారు. అఫ్గాన్‌ను ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారకుండా చూడాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.

‘‘భారత్‌లో ఏళ్లుగా ప్రజాస్వామ్య పరంపర కొనసాగుతోంది. బాల్యంలో టీ అమ్మిన వ్యక్తి ఇవాళ ఐరాస జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగిస్తున్నారు. భారత్‌.. ప్రజాస్వామ్య ప్రకాశానికి ఒక ఉదాహరణ. ప్రజాస్వామ్య మాతగా పేరున్న భారత్‌కు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా. మా దేశంలోని వైవిధ్యమే ప్రజాస్వామ్యాన్ని బలంగా మార్చింది. సమాజంలో ప్రతి వ్యక్తీ సంతోషంగా ఉండాలనేదే భారతీయ చింతన. వందేళ్లలో ఎప్పుడూ చూడని విపత్తును కరోనా రూపంలో చూశాం. కరోనా వల్ల మరణించిన వారందరికీ నివాళులర్పిస్తున్నా’’ అని మోదీ అన్నారు. 

‘‘కరోనా వేళలలోనూ 3 కోట్ల మందికి ఇళ్లు కట్టించాం. భారత్‌ అనేక డిజిటల్‌ సంస్కరణలను తీసుకొచ్చింది. భారత అభివృద్ధి ప్రపంచానికి చోదకశక్తిగా మారుతోంది. సైన్స్‌, టెక్నాలజీ వాడుకుని ముందుకెళ్తున్నాం. భారత్‌ తెచ్చిన సంస్కరణలు ప్రపంచాన్నే మారుస్తాయి. కరోనా వేళ మేం తెచ్చిన కొవిన్‌ యాప్‌ అద్భుతంగా పనిచేసింది. దేశంలోని 6 లక్షల గ్రామాలను డ్రోన్‌ మ్యాపింగ్‌ చేశాం. కొవిడ్‌ నిర్మూలన కోసం ప్రపంచంలోనే తొలిసారిగా భారత్‌ డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. 12 ఏళ్లు దాటిన వారికి ఈ డీఎన్‌ఏ టీకాను అందించనుంది. త్వరలోనే ముక్కు ద్వారా ఇచ్చే టీకాను తీసుకొస్తాం. ఎంఆర్‌ఎన్‌ఏ టీకా తయారీ చివరి దశలో ఉంది. పర్యావరణ పరిరక్షణకు భారత్‌ కట్టుబడి ఉంది. 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని దేశ ప్రగతిని ఐరాస వేదికగా మోదీ వివరించారు. 

‘‘అఫ్గాన్‌లోని మైనార్టీలకు రక్షణ కల్పించాలి. ఆ దేశంలోని చిన్నారులు, మహిళల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉగ్రవాదం ప్రపంచానికే ప్రమాదకరంగా మారుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు గళం కలపాలి. ప్రపంచ ఉగ్రవాదుల స్వర్గంగా అఫ్గాన్‌ను మారనీయకూడదు. కొన్ని దేశాలు తీవ్రవాదాన్ని రాజకీయంగా ఆయుధంగా వాడుతున్నాయి’’ అని పాక్‌ పేరును ప్రస్తావించకుండా ప్రధాని మోదీ దాయాది దేశంపై విమర్శలు గుప్పించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని