Modi: ట్విటర్‌లో ప్రధాని మోదీ అరుదైన ఫీట్

తాజా వార్తలు

Published : 29/07/2021 18:37 IST

Modi: ట్విటర్‌లో ప్రధాని మోదీ అరుదైన ఫీట్

ఏడు కోట్లు దాటిన ప్రధాని అనుచరగణం

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్‌లో కీలక మైలురాయిని చేరుకున్నారు. ట్విటర్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న నేతల్లో ఒకరిగా నిలిచారు. ఆయన్ను అనుసరించేవారి సంఖ్య బుధవారంతో ఏడుకోట్ల(70 మిలియన్లు) మార్కును దాటింది.

గుజరాత్ మఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009లో మోదీ ట్విటర్‌ ఖాతాను ప్రారంభించారు. 2010 నాటికి ఆయన్ను అనుసరించేవారి సంఖ్య లక్షగా ఉంది. పది సంవత్సరాలు అంటే 2020లో ఆ సంఖ్య ఆరు కోట్ల(60 మిలియన్లు)కు చేరింది. ఇప్పుడా సంఖ్య ఏడు కోట్లను దాటింది. అదే సమయంలో కేంద్రమంత్రి అమిత్‌ షా ఖాతాను 2.63 కోట్లు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని 1.94 కోట్ల మంది అనుసరిస్తున్నారు. 

ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా దేశ ప్రజలకు చేరువగా ఉంటారు. దేశంలో జరుగుతోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తుంటారు. ఆయన చూపుతున్న చొరవతో అంతర్జాతీయంగా ప్రజాదరణ చూరగొన్నారని కేంద్రమంత్రి పీయూశ్‌ గోయల్ అన్నారు. ‘మోదీజీ విజన్, నిర్ణయాత్మక చర్యలు ఆయనకున్న ప్రజాదరణను మరింత పెంచుతున్నాయి. ఏడుకోట్ల ఫాలోవర్లను సంపాదించుకొని మరొక మైలురాయి దాటిన ప్రధానికి నా అభినందనలు. మీ నాయకత్వం పట్ల మేం గర్వంగా ఉన్నాం’ అని గోయల్ ట్వీట్ చేశారు. 

ఇటీవల కాలంలో కొత్త ఐటీ నిబంధనల విషయంలో ట్విటర్, కేంద్రానికి మధ్య వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. అలాగే రైతుల ఆందోళనల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య  భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. ఆ సమయంలో పలువురు కేంద్రమంత్రులు దేశీయ యాప్‌ ‘కూ’ లో చేరారు. ట్విటర్‌తో పాటు ఈ యాప్‌ను కూడా వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాలు, ఇండియా పోస్ట్‌, మై గవర్నమెంట్‌, డిజిటల్ ఇండియాలు కూడా కూ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రధాని మాత్రం కూలో ఇంకా ఖాతా తెరవలేదు.      


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని