close

తాజా వార్తలు

Updated : 28/02/2021 15:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పట్టించిన సంకెళ్లు..!

 జైలు బద్దలుకొట్టిన గ్యాంగ్‌లీడర్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

కరేబియన్‌ దేశమైన హైతీలో అతడో గ్యాంగ్‌ లీడర్‌..  భూలోక నరకం వంటి జైలు నుంచి బయటపడాలని విశ్వప్రయత్నం చేశాడు.. బయటకు వచ్చి మళ్లీ తన దందాలు మొదలు పెట్టాలనుకున్నాడు.  తన అనుచరులతో కలిసి జైలును బద్దలు కొట్టాడు.. ఈ క్రమంలో అడ్డొచ్చిన వారిపై అనుచరులతో కలిసి దాడి చేసి పరారయ్యాడు. తనని ఎవరూ గుర్తించరన్న ధైర్యంతో బైక్‌పై ప్రయాణమయ్యాడు.. కానీ, అతని కాళ్లకు బేడీలు ఉండటం భద్రతా దళాల కంటపడింది. వారు అతన్ని పట్టుకొనే క్రమంలో కాల్పులు జరిపారు. చివరికి అతడు ప్రాణాలు కోల్పోయాడు.  హైతీలోని క్రోయిక్స్‌ దెస్‌ బాంకెట్‌ జైలును బద్దలుకొట్టిన ఘటన మోస్ట్‌ వాంటెడ్‌  క్రిమినల్‌ అర్నెల్‌ జోసెఫ్‌ అంతానికి కారణమైంది. 

అసలేం జరిగింది..

గురువారం మధ్యాహ్నాం హైతిలోని క్రోయిక్స్‌ దెస్‌ బాంకెట్‌  జైలులో రిక్రియేషన్‌ సమయంలో బయట నుంచి కొందరు వ్యక్తులు ఒక్కసారిగా జైలు గార్డులపై తుపాకులతో భీకరంగా కాల్పులు జరిపారు. అదే సమయంలో జైల్లోని ఖైదీలు కూడా గార్డులపై దాడి చేశారు.  వీరి ధాటికి గార్డులు ప్రాణాలు కాపాడుకోవడానికి  పారిపోయారు. జైలు డైరెక్టర్ పాల్‌ జోసెఫ్‌ను హత్య చేసి బయటపడ్డారు. వెనకవైపు తలుపులను బద్దలు కొట్టుకొని  ఏకంగా 400 మంది ఖైదీలు రోడ్లపైకి వచ్చారు. సమీపంలోని ఓ వస్త్రదుకాణంపై పడి బెదిరించి దుస్తులను దోచుకొన్నారు. అదే సమయంలో పోలీసులు అప్రమత్తం కావడంతో మిగిలిన ఖైదీలు పరారు కాకుండా అడ్డుకొన్నారు. వీరిలో షాన్‌టీ పట్టణాన్ని వణికించిన గ్యాంగ్‌ లీడర్‌ అర్నెల్‌ జోసెఫ్‌  కూడా ఉన్నాడు. అసలు జోసెఫ్‌ను తప్పించడానికే ఈ దాడి జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో వారు గాలింపును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో  60 మందిని అదుపులోకి తీసుకొన్నారు. 

బేడీలతో బైక్‌పై..

జైలు నుంచి పరారైన జోసెఫ్‌ ఓ బైక్‌పై ప్రయాణిస్తూ ఓ చెక్‌ పాయింట్‌ వద్దకు చేరుకొన్నాడు. అతని కాళ్లకు జైల్లో వేసిన బేడీలు ఇంకా ఉన్నాయి.  దీంతో చెక్‌పాయింట్‌ వద్ద అధికారులకు అనుమానం వచ్చి ఆగమని ఆదేశించారు. కానీ, జోసెఫ్‌ వారిపై దాడికి ప్రయత్నించడంతో కాల్పులు జరిపారు. ఫలితంగా అతడు అక్కడికక్కడే మరణించాడు. జోసెఫ్‌ జీవితం మొత్తం నేరమయమే. 2011లో అతను పలువురు పోలీసు అధికారులను చంపిన  కేసులో అరెస్టయి ఆరు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత బయటకు వచ్చాక ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని ట్రక్కులను దోచుకోవడం, మహిళలపై అత్యాచారాలు, కిడ్నాప్‌లు, జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలపై దాడులు చేయడం వంటివి మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పోలీసులు 2019లో మరోసారి అరెస్టు చేసి జైల్లో వేశారు. 2020 జులైలో తన గది  నుంచి బయటకు వచ్చి జైలు పైకప్పుపై నక్కాడు. అప్పట్లో అతి కష్టం మీద అతన్ని జైలు గార్డులు అదుపులోకి తీసుకొన్నారు. 

హైతి జైళ్లు  నరకానికి ప్రతిరూపాలు..

ప్రపంచంలోనే అత్యంత దారుణమైన జైళ్లకు హైతీ ప్రసిద్ధి. నరకానికి ప్రతిరూపాలుగా వాటిని వర్ణిస్తారు. ఇక్కడి జైళ్లు కిక్కిరిసిపోయి ఉంటాయి.  క్రోయిక్స్‌ దెస్‌ బాంకెట్‌ను అత్యాధునిక  జైలుగా పేర్కొంటారు. ఇక్కడ 872 మంది ఉండాల్సిన చోట 1500 మందిని కుక్కి ఉంచారు. ఇక మిగిలిన జైళ్లలో పరిస్థితి ఘోరంగా ఉంటుంది. 18 పడకలు ఉన్న జైలు గదిలో 60 మంది ఉంటారు. వీరు 23 గంటలపాటు తమ గదిలో ఉండాల్సిందే. భోజనం వంటివి ఇచ్చేందుకు మాత్రం రోజుమొత్తంలో ఒక గంట తెరుస్తారు. మంచి భోజనం కావాలంటే జైలు అధికారులకు సొమ్ములు ముట్టాల్సిందే. ఇక కాలకృత్యాలు తీర్చుకోవడానికి గదులు చుట్టుపక్కలే  ఉంటాయి. సాధారణ మానవుడు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేడు.  1200 మంది ఉండాల్సిన జైళ్లలో 4300 మంది ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జైళ్ల సామర్థ్యం కంటే 454శాతం అధికంగా ఖైదీలు ఉన్నట్లు లండన్‌ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ క్రిమినల్‌ పాలసీ రీసెర్చి పేర్కొంది. ఈ జైళ్లలో అత్యధికులు విచారణ ఖైదీలే. కానీ, కొన్నేళ్ల నుంచి జడ్జి ఎదుట హాజరుపర్చకుండా వీరిని ఇక్కడే ఉంచుతున్నారు.  2017 నాటికి ఇలాంటి వారు 40శాతం వరకు ఉన్నట్లు అంచనా. ఇక ఇక్కడ అంటు వ్యాధులు తరచూ ప్రబలి భారీ సంఖ్యలో ఖైదీలు మరణిస్తుంటారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని