Lockdown: ఉంటే పచ్చడి మెతుకులు.. లేదంటే పస్తులు

తాజా వార్తలు

Published : 25/05/2021 22:25 IST

Lockdown: ఉంటే పచ్చడి మెతుకులు.. లేదంటే పస్తులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేయడం.. నిరుపేదలు, దిక్కూమొక్కూ లేని వారి కడుపుల్ని మాడుస్తోంది. పొట్ట చేతపట్టుకుని వివిధ రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన పేదలు వీధిన పడ్డారు. చేసేందుకు పనిలేక, ఆకలి తీర్చుకునేందుకు డబ్బులు లేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. పార్కులు, పాదబాటలు, బస్సు షెల్టర్లు, మెట్రో స్టేషన్లను ఆవాసాలుగా మార్చుకుని పట్టెడన్నానికి పడిగాపులు పడుతున్నారు.

హైదరాబాద్‌.. అందరినీ అక్కున చేర్చుకునే మహానగరం. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి ఆనందంగా గడుపుతారు. అన్నపానీయాలకు భాగ్యనగరంలో లోటు లేదనేది అందరి మాట. తక్కువ ఖర్చుతోనే జీవనం గడిపేందుకు సదుపాయాలు గ్రేటర్‌లో సమకూరుతాయి. కానీ, కరోనా మహమ్మారి తెచ్చిన కష్టాలు పేదలు, కూలీలు, అభాగ్యుల నోటి దగ్గరి ముద్దను లాగేశాయి. లాక్‌డౌన్‌ అమలు వల్ల ఆకలి బాధలు రెట్టింపు అయ్యాయి. చేసేందుకు పనిలేక, పిల్లాపాపకు పట్టెడన్నం పెట్టలేక దాతల సాయం కోసం కూలీలు ఎదురు చూస్తున్నారు.

హైదరాబాద్‌లోని ప్రధాన మార్గాల్లో అభాగ్యులు అన్నం కోసం అలమటించడం కలిచివేస్తోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే ఆంక్షల సడలింపు ఉండటం వల్ల ఎవరికీ పని దొరకడం లేదు. అద్దె చెల్లించడం లేదని కొందరు యజమానులు ఇల్లు ఖాళీ చేయించడంతో ఎందరో వీధిన పడ్డారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ బస్‌స్టాప్‌లు, మెట్రో స్టేషన్లలో తల దాచుకుంటున్నారు. కొందరు దాతలు ఇచ్చిన ఆహారపు పొట్లాలను రాత్రికి దాచుకుని, పాచిపోయినా వాటినే తింటున్నారు. ఉంటే పచ్చడి మెతుకులు, లేదంటే పస్తులతో గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నపూర్ణ క్యాంటీన్ల సంఖ్య పెంచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిరుపేదలు, గూడులేని వాళ్లు, రోజు కూలీలు, అనాథలకు ప్రభుత్వమే భోజన సదుపాయం కల్పించాలని చెబుతున్నారు. ఎక్కడైనా తలదాచుకునే అవకాశం కల్పించి, ఆహారం అందించే స్వచ్ఛంద సంస్థలకు వివరాలు అందిస్తే వాళ్లైనా అదుకుంటారనే ఆశ వారిది.   



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని