Dr VK Paul: గర్భిణులు టీకా తీసుకోవాలి

తాజా వార్తలు

Published : 09/07/2021 21:56 IST

Dr VK Paul: గర్భిణులు టీకా తీసుకోవాలి

దిల్లీ: గర్భిణీ స్త్రీలు కరోనా వ్యాక్సిన్‌ను నిర్భయంగా తీసుకోవాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు డా. వీకే పాల్‌ సూచించారు. దేశంలో అందుబాటులో ఉన్న కొవిడ్‌ టీకాలు గర్భిణులకు ఎలాంటి హాని చేయవని అధ్యయనాలు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. గర్భిణీ స్త్రీలకు వైరస్‌ సోకితే వారు నెలలు నిండకముందే డెలివరీ అయ్యే అవకాశాలున్నట్లు అధ్యయనాలు చెబుతున్నట్లు వివరించారు. ‘గర్భిణులకు వైరస్‌ సోకితే వారితో పాటు గర్భంలోఉన్న బిడ్డకు కూడా హాని కలిగే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలకు టీకా విధానంపై కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. గర్భిణీ స్త్రీలు కచ్చితంగా టీకా వేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం’ అని డా.వీకే పాల్‌ పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. కానీ గర్భిణులపై విస్తృత ప్రయోగాల వివరాలు లేకపోవడంతో వీటిపై నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో వైరస్‌ బారినపడుతున్న గర్భిణీ స్త్రీల సంఖ్య పెరగడం.. రానున్న రోజుల్లోనూ థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఈ విషయంపై మరోసారి చర్చించింది. ఇందులో భాగంగా గర్భిణులకు కూడా వ్యాక్సిన్‌ ఇవ్వవచ్చని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వయిజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (NTAGI) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.

ఈ నేపథ్యంలోనే గర్భిణీ స్త్రీలు సైతం కొవిడ్‌ టీకా వేసుకోవాలని ఈనెల 2న కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా వ్యాక్సిన్‌ కోసం వారు కొవిన్‌ యాప్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది. దీంతోపాటు సమీప కేంద్రాలకు నేరుగా వెళ్లి టీకా వేయించుకోవచ్చని వెల్లడించింది. గర్భిణులకు టీకాలు వేసే కార్యాచరణ, మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకున్నట్లు తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని