Ramnath: మాతృభూమికి వందనం..!

తాజా వార్తలు

Published : 27/06/2021 15:52 IST

Ramnath: మాతృభూమికి వందనం..!

లఖ్‌నవూ: రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలిసారిగా స్వగ్రామానికి వెళ్లారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లా పరుంఖ్‌ గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్ద దిగిన ఆయన ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. వంగి చేతిని నేలకు ఆనించి నమస్కరించారు. తిరిగి ఆ చేతిని శిరస్సుకు తగిలించుకొని మాతృభూమిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ హెలీప్యాడ్‌ వద్దకు చేరుకొని రాష్ట్రపతికి సాదర స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన చిత్రాలను రాష్ట్రపతి కార్యాలయం ట్విటర్‌లో పంచుకుంది.

అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో రాష్ట్రపతి మాట్లాడారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగుతోందని, అర్హులైన వారంతా టీకా వేయించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్‌ వేసుకోవడంతో పాటు చుట్టుపక్కల వారు  వేయించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. గ్రామ ప్రజల ఆదరాభిమానాలను ఈ జన్మలో మరచిపోలేనన్నారు. ‘‘ నేను ఎక్కడున్నా.. నా మాతృభూమి మట్టి వాసన, గ్రామస్థుల తీపి గుర్తులు ఎప్పుడూ నా వెంటే ఉంటాయి. మీరంతా ఎప్పటికీ  నా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. పరుంఖ్‌ కేవలం ఓ గ్రామం కాదు.. నాకు ఎన్నో విషయాలను నేర్పించి, దేశానికి సేవ చేయగలిగే స్థితికి తీసుకెళ్లిన నా మాతృభూమి’’ అని రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. తనలాంటి ఓ అతి సామాన్య వ్యక్తి దేశంలోనే అత్యున్నత స్థానాన్ని అధిరోహించగలడని కలలో కూడా అనుకోలేదని, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ దీనిని నిరూపించి చూపించిందని ఆయన అన్నారు.

రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలిసారిగా రైలు ప్రయాణం చేశారు. దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌లో రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక రైలులో కాన్పూర్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పరుంఖ్‌ వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడ పర్యటించి.. తిరిగి జూన్‌ 28న కాన్పూర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో రైలెక్కి లఖ్‌నవూ వెళ్లనున్నారు. అక్కడ మరో రెండు రోజుల పర్యటన అనంతరం జూన్‌ 29 సాయంత్రం ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకోనున్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని