కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. పల్స్‌ పోలియో

తాజా వార్తలు

Updated : 31/01/2021 13:50 IST

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. పల్స్‌ పోలియో

ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

దిల్లీ: పోలియో రహిత భారతదేశాన్ని సాధించే లక్ష్యంలో భాగంగా నేడు ‘జాతీయ పోలియో నిరోధక దినోత్సవాన్ని’ (నేషనల్‌ పోలియో ఇమ్మ్యునైజేషన్‌ డే) పాటిస్తున్నారు. పల్స్‌ పోలియో-2021 కార్యక్రమాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం సాయంత్రం ప్రారంభించారు. దీనిలో భాగంగా రాష్ట్రపతి భవన్‌లో చిన్నారులకు ఆయన పోలియో చుక్కలను వేశారు. ఈ కార్యక్రమానికి ప్రథమ మహిళ సవితా కోవింద్‌, కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి హర్ష్‌వర్ధన్‌ తదితరులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని, నిర్దేశిత కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగానే  నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నిరోధించేందుకు వైద్యారోగ్య సిబ్బంది, తల్లితండ్రులకు కూడా మాస్కులు, సామాజిక దూరం, శానిటైజేషన్‌ తదితర జాగ్రత్తలు తప్పనిసరి అని వివరించారు.

17కోట్ల చిన్నారులకు రక్షణ

ఈ సంవత్సరం పోలియో నిరోధక దినోత్సవాన్ని దేశంలో జనవరి 31న పాటిస్తున్నారు. ‘పోలియో ఆదివారం’ అనే ఈ కార్యక్రమంలో భాగంగా అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో టీకాను ఉచితంగా అందచేస్తారు. ఈ సంవత్సరం సుమారు 17 కోట్ల మంది చిన్నారులకు పోలియో నుంచి రక్షణ కల్పించటమే లక్ష్యమని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో 24 లక్షల మంది వాలెంటీర్లు, 1.5 లక్షల సూపర్‌వైజర్లు పాల్గోనున్నారు. వీరు దేశవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా గృహాలను సందర్శించి.. ప్రతి ఒక్క చిన్నారికీ పోలియో టీకా రక్షణ అందేలా జాగ్రత్త తీసుకుంటారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరాస అనుబంధ సంస్థ యూనిసెఫ్‌, రోటరీ ఫౌండేషన్‌ తదితర పలు సామాజిక, సేవా సంస్థలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి.

ఐనా అప్రమత్తత తప్పనిసరి

కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్స్‌పోలియో కార్యక్రమం ప్రారంభానికి ముందు అంతర్జాతీయ పోలియో కేసుల్లో 60 శాతం భారత్‌లోనే ఉండేవని.. దశాబ్ద కాలంగా మన దేశం పోలియో రహితం ప్రాంతంగా మారిందని వివరించారు. దేశంలో ఆఖరి పోలియో కేసు జనవరి 13, 2011న పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో నమోదైనట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యారోగ్య సిబ్బంది, అధికారుల సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని ఆయన ప్రశంసించారు. అయినప్పటికీ.. కొన్ని పొరుగు దేశాలతో సహా, ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల ఇంకా పోలియో వ్యాపిస్తుండటంతో మనం అప్రమత్తంగానే ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి..

ఈ దశాబ్దం భారత్‌కు కీలకం.. మోదీ

97 శాతానికి కొవిడ్‌ రికవరీ రేటుAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని