పడకల్లేవ్‌.. ఆక్సిజన్‌ బయటే ఎక్కిస్తున్నారు!

తాజా వార్తలు

Updated : 06/04/2021 21:19 IST

పడకల్లేవ్‌.. ఆక్సిజన్‌ బయటే ఎక్కిస్తున్నారు!

కరోనా ఉద్ధృతితో పుణెలో పరిస్థితి అధ్వాన్నం

మళ్లీ ఆంక్షల దిశగా పలు రాష్ట్రాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. గతేడాది కన్నా మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. దీంతో మహారాష్ట్ర, దిల్లీ సహా పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూతో పాటు వీకెండ్ లాక్‌డౌన్‌ ప్రకటించగా.. తాజాగా దిల్లీలోనూ రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.కొవిడ్‌ బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో పలుచోట్ల వైద్య సదుపాయాల కొరతతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

పడకల్లేవ్‌.. బయటే ఆక్సిజన్‌ సరఫరా!
పుణెలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉంది. నిన్న ఒక్కరోజే ఇక్కడ 8075 కొత్త కేసులు వెలుగుచూడటం గమనార్హం. రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో పడకల కొరతతో పరిస్థితి దారుణంగా తయారైంది. పింప్రీ చించ్వాడ్‌లోని యశ్వంత్‌రావ్‌ చవాన్‌ స్మారక ఆస్పత్రిలో 400 పడకలకు గాను (55 ఐసీయూ) ప్రస్తుతం ఒక్క పడక కూడా ఖాళీ లేదు. అలాగే, పుణెలో వెంటిలేటర్ల కొరతా తీవ్రంగా ఉంది. అత్యధికమంది రోగులు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులతోనే వస్తుండటంతో ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్‌లు లేకపోవడంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. కొందరు రోగులకు ఆరు బయటే పడకలు ఏర్పాటు చేయడం గమనార్హం.

రాత్రి 8గంటల తర్వాత ఆర్డర్లు తీసుకోం
మహారాష్ట్రలో కరోనా డేంజర్‌ బెల్‌ మోగిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో రాత్రి 8గంటల తర్వాత తమ సేవలు నిలిపివేస్తున్నట్టు ఫుడ్‌ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగీ ముంబయిలోని తమ వినియోగదారులకు నోటిఫికేషన్లు పంపాయి. ఏవైనా ఆర్డర్లు చేయాలంటే 8గంటల కన్నా ముందే చేసుకోవాలని సోమవారం సందేశాలు పంపాయి. నిన్నటి నుంచి కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఉదయం 7గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మాత్రమే ప్రభుత్వం ఫుడ్‌ హోండెలివరీ సేవలకు అనుమతిచ్చింది.

దూకుడు వ్యూహాలతోనే కట్టడి సాధ్యం: గులేరియా
దేశంలో కరోనా రెండో విజృంభణ వేళ తొలిసారి లక్ష కేసులు రావడంపై దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఆందోళన వ్యక్తంచేశారు. హాట్‌స్పాట్‌లలో లాక్‌డౌన్ విధించడం వల్లే కరోనా కళ్లెం వేయగలమని అభిప్రాయపడ్డారు. హాట్‌ స్పాట్‌లను గుర్తించి కంటైన్‌మెంట్‌ జోన్‌ల ఏర్పాటు సహా పలు కట్టడి వ్యూహాలను దూకుడుగా చేపడితేనే వైరస్‌ను కట్టడి చేయగలమన్నారు.

ఆ పరిమితి ఎత్తేస్తే.. మూణ్నెళ్లలో అందరికీ టీకా

కరోనా విజృంభిస్తున్న వేళ దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్‌ కేంద్రాలను 24గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించిన సీఎం కేజ్రీవాల్‌.. టీకా వేయించుకొనేందుకు ఉన్న వయస్సు పరిమితిని ఎత్తివేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. ఆ నిబంధనను సడలిస్తే  రానున్న మూడు నెలల్లోనే దిల్లీ వాసులందరికీ టీకా పంపిణీ చేస్తామని, తద్వారా వైరస్‌ కట్టడి చేయవచ్చని లేఖలో పేర్కొన్నారు.

ఇండోర్‌ క్రీడలపై కశ్మీర్‌ ఆంక్షలు  

కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇండోర్‌ క్రీడలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు యువజన సర్వీసులు, క్రీడల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాలు జారీచేశారు. బాక్సింగ్‌, రెజ్లింగ్‌, జూడో, కరాటే, కబడ్డీ, ఖోఖో, తంగా ట, తైక్వాండో, వుషు తదితర క్రీడలతో కరోనా వ్యాపించే అవకాశం ఉండటంతో వాటిపై తాత్కాలిక నిషేధం విధించింది. తగిన నిబంధనలను అనుసరించి మాత్రమే బహిరంగ క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది.

మే 15వరకు సమావేశాలొద్దు: ఎస్‌బీఐ

కరోనా కేసులు పెరుగుతుండటంతో పలు బ్యాంకులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. బ్రాంచ్‌లలో అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీచేస్తున్నాయి. తమ బ్యాంకు శాఖల్లో అవసరమైన శానిటైజర్లు, మాస్క్‌లు, ఫేస్‌ షీల్డ్‌లను స్థానికంగా కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా మే 15 వరకు ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని ఎస్‌బీఐ తెలంగాణ రాష్ట్ర సీజీఎం బ్రాంచిల ప్రతినిధులకు ఆదేశాలు జారీచేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని