
తాజా వార్తలు
‘క్వాడ్’: త్వరలోనే నాలుగు దిగ్గజాల భేటీ!
జో బైడన్ హాజరవుతారన్న ఆస్ట్రేలియా ప్రధాని
సిడ్నీ: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ త్వరలోనే ‘క్వాడ్’ సదస్సులో పాల్గొంటారని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ వెల్లడించారు. అంతర్జాతీయంగా చైనా నుంచి ముప్పు ఎక్కువ అవుతోందని పలు దేశాలు భావిస్తోన్న తరుణంలో నాలుగు దిగ్గజ దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొననుండటం గమనార్హం. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ దేశాలతో చైనా వైరాన్ని కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే.
త్వరలో జరగబోయే క్వాడ్ సమావేశం ఇండో-పసిఫిక్ ముఖచిత్రంగా మారుతుందని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం కోసం నాలుగు ప్రజాస్వామ్య దేశాలు, నలుగురు అధినేతలు నిర్మాణాత్మకంగా కలిసి పనిచేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. సదస్సు నిర్వహణ కోసం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లతో చర్చించినట్లు మారిసన్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంపై తమకు, అమెరికాకు కీలక కేంద్రంగా క్వాడ్ నిలిచిందన్నారు. అయితే ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. వర్చువల్ పద్ధతిలోనే ఈ సమావేశం జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.
పసిఫిక్ నుంచి హిందూ మహాసముద్రం వరకు చైనా ప్రాబల్యాన్ని నిలువరించడానికి భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు ‘క్వాడ్’గా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇవి తమ లక్ష్య సాధన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. చైనాకు పగ్గాలు వేసే చట్టాలను అమెరికా, ఆస్ట్రేలియాలు తీసుకురాగా, లద్దాఖ్‌లో చైనా దూకుడును అడ్డుకొంటూనే హిందూ మహాసముద్రంలో పైచేయి సాధించడానికి భారత్ చురుగ్గా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో క్వాడ్ సభ్యదేశాల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తొలిసారిగా ఈ సదస్సులో పాల్గొనడం మరింత ఆసక్తి కలిగిస్తోంది.