Nuclear Leak: లీకేజిపై స్పందించిన చైనా!
close

తాజా వార్తలు

Updated : 15/06/2021 18:57 IST

Nuclear Leak: లీకేజిపై స్పందించిన చైనా!

రేడియా ధార్మికత సాధారణ స్థాయిలోనే ఉందని వెల్లడి

బీజింగ్‌: చైనాలోని తైషాన్‌ అణు విద్యుత్తు కర్మాగారంలో సంభవించిన లీకేజిపై చైనా స్పందించింది. ఆ ప్లాంటు నుంచి విడుదలవుతున్న రేడియో ధార్మికత సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దీనివల్ల  భద్రతాపరమైన సమస్యలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

‘అణువిద్యుత్తు కేంద్రం నుంచి విడుదలవుతున్న రేడియోధార్మికతతో ప్రస్తుతానికి ఎలాంటి అసాధారణ పరిస్థితులు కనిపించడం లేదు. భద్రతకు భరోసా ఇస్తున్నాం’ అని చైనా విదేశీవ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ పేర్కొన్నారు. అణువిద్యుత్తు కేంద్రాల నిర్వహణలో చైనాకు మంచి ట్రాక్‌ రికార్డు ఉందన్నారు. ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపే సంఘటనలు ఇప్పటివరకు చోటుచేసుకోలేదని ఝావో లిజియన్‌ గుర్తుచేశారు.

చైనాలోని గుయాంగ్‌డాంగ్‌ ప్రావిన్సులో ఉన్న తైషాన్‌ అణు విద్యుత్తు కర్మాగారం నిర్వహణ బాధ్యతలను ఫ్రాన్స్‌ కంపెనీ ఫ్రామాటోమ్‌ చేపడుతోంది. అయితే, ఈ ప్లాంటు నుంచి లీకేజి జరుగుతున్నట్లు ఫ్రామాటోమ్‌ కంపెనీ, అమెరికా ఇంధన శాఖకు సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన అమెరికా, లీకేజి వల్ల తలెత్తే పరిణామాలను నిశితంగా పరిశీలించే పనిలో నిమగ్నమయ్యింది. ఇదే సమయంలో ప్లాంటులో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు తమ సంస్థకు చెందిన నిపుణుల బృందాలు కృషిచేస్తున్నాయని ఫ్రాన్స్‌ కంపెనీ ఫ్రామాటోమ్‌ వెల్లడించింది.

ప్రపంచంలో అత్యధిక అణువిద్యుత్తు కేంద్రాలున్న దేశాల్లో చైనా మూడో స్థానంలో కొనసాగుతోంది. అక్కడ దాదాపు డజనుకుపైగా అణువిద్యుత్తు కేంద్రాలున్నాయి. వీటి కోసం చైనా వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోంది. ఇక అణువిద్యుత్‌ కేంద్రాల్లో అమెరికా, ఫ్రాన్స్‌ దేశాలు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని