Rahul Gandhi: లఖింపుర్‌ వెళ్తున్నాం.. అరెస్టులు, దాడులకు భయపడం.. 

తాజా వార్తలు

Updated : 06/10/2021 12:03 IST

Rahul Gandhi: లఖింపుర్‌ వెళ్తున్నాం.. అరెస్టులు, దాడులకు భయపడం.. 

దిల్లీ: అన్నదాతలను కేంద్రం తీవ్రంగా అవమానిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. రైతులపై వరుస దాడులు జరుగుతున్నాయని, వారి సమస్యలపై ప్రశ్నిస్తున్న తమని కూడా అడ్డుకుంటున్నారని అన్నారు. దేశంలో నియంతృత్వ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. అయినప్పటికీ తాము భయపడేది లేదని, లఖింపూర్‌ ఖేరికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శిస్తామని తెలిపారు.

లఖింపుర్‌ ఖేరిలో గత ఆదివారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ బృందం సిద్ధమైంది. అయితే వీరి పర్యటనకు యూపీ పోలీసులు అనుమతినివ్వలేదు. ఈ నేపథ్యంలో నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాహుల్‌ గాంధీ.. కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

‘‘రైతులపై గత కొంతకాలంగా వరుస దాడులు జరుగుతున్నాయి. వారిపై హత్యలకు పాల్పడుతున్నారు. లఖింపుర్‌ ఘటనలో కేంద్ర మంత్రి, ఆయన కుమారుడి పేర్లు వస్తున్నా.. వారిపై ఇంకా చర్యలు తీసుకోలేదు. నిన్న లఖ్‌నవూలోనే పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కనీసం లఖింపుర్‌ వెళ్లి వారిని పరామర్శించలేదు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న మమ్మల్ని కూడా అడ్డుకుంటున్నారు. దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతోంది. బాధితులను పరామర్శించే హక్కు మాకు లేదా? యూపీలో 144 సెక్షన్‌ అమల్లో ఉంది. కానీ మేం ముగ్గురమే వెళ్దామనుకుంటున్నాం. అక్కడ ఏం జరిగిందో క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని భావిస్తున్నాం’’ అని రాహుల్‌ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ అరెస్టు గురించి కూడా రాహుల్‌ స్పందించారు. అరెస్టులు, దాడులకు తాము భయపడేది లేదన్నారు. అసలు ప్రియాంకను పోలీసులు ఎందుకు నిర్బంధించారో చెప్పాలని ప్రశ్నించారు. 

రాహుల్‌ను అడ్డుకుంటాం: యూపీ పోలీసులు

భద్రతా కారణాల వల్లే రాహుల్‌ పర్యటనకు అనుమతి ఇవ్వలేదని యూపీ పోలీసులు తెలిపారు. ఆయన లఖింపుర్‌కు వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే అవకాశముందని అన్నారు. ఒకవేళ ఆయన లఖ్‌నవూ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటే.. లఖింపుర్‌ వెళ్లొద్దని కోరతామన్నారు. ఇదిలా ఉండగా.. ప్రియాంక గాంధీని నిర్బంధించిన సీతాపూర్‌లో ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు విధించారు. అటు లఖింపుర్‌ ఘటనపై యూపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖను నివేదిక అందించనుంది. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని