Heavy Rains: తడిసి ముద్దయిన దిల్లీ.. రోడ్లపై మోకాలి లోతు నీరు.. భారీ ట్రాఫిక్‌ జామ్‌!

తాజా వార్తలు

Updated : 01/09/2021 21:32 IST

Heavy Rains: తడిసి ముద్దయిన దిల్లీ.. రోడ్లపై మోకాలి లోతు నీరు.. భారీ ట్రాఫిక్‌ జామ్‌!

19 ఏళ్లలో ఇంత కుంభవృష్టి ఇదే తొలిసారి.. 

దిల్లీ: దిల్లీ నగరం తడిసి ముద్దయింది. గత 19 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎడతెరపిలేకుండా కురిసిన ఈ కుండపోతతో దేశ రాజధాని నగరం అతలాకుతలమైంది. సెప్టెంబర్‌ నెలంతా కురవాల్సిన వానలో దాదాపు 90శాతం ఒక్కరోజే పడటంతో దిల్లీ నగరం చిగురుటాకులా వణికిపోయింది. గత నాలుగు రోజులుగా దిల్లీలో వర్షాలు కురుస్తున్నప్పటికీ.. మంగళవారం ఉదయం 8.30గంటల నుంచి బుధవారం ఉదయం 8.30గంటల మధ్య రికార్డు స్థాయిలో 112.1మి.మీల వర్షపాతం నమోదైంది. దీంతో దిల్లీ సహా చుట్టుపక్కల ప్రాంతాలైన గురుగ్రామ్‌, నోయిడాలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులపై మోకాలి లోతు నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  

గత రికార్డులను పరిశీలిస్తే..

దిల్లీలో సెప్టెంబర్‌ మాసం అంతా కలిపి సగటున 125.1మి.మీల వర్షపాతం నమోదవుతుండగా.. ఈ నెల ప్రారంభమైన తొలిరోజే అందులో దాదాపు 90శాతం వాన కురిసినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది.  నిన్న ఉదయం 8.30గంటల నుంచి వర్షం ప్రారంభమైన తొలి మూడు గంటల్లోనే దిల్లీలో దాదాపు 75.6మి.మీల వర్షం కురవడం గమనార్హం. ఇకపోతే, గత రికార్డులను పరిశీలిస్తే.. 2002 సెప్టెంబర్‌ 13న దిల్లీలో 126.8 మి.మీ.ల వర్షపాతం నమోదుకావడం ఒక రికార్డు కాగా..  1963 సెప్టెంబర్‌ 16న ఒక్కరోజే 172.6మి.మీల వర్షం కురవడం ఆల్‌టైమ్‌ రికార్డుగా ఉంది.

నీట మునిగిన కార్లు..

ఈ కుండపోత వానకు దిల్లీ నగరం సహా చుట్టుపక్కల నోయిడా, గురుగ్రామ్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులపై మోకాలి లోతు నీరు చేరింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అండర్‌ పాస్‌లలో కార్లు నీట మునిగాయి. వాహనాల యంత్రాల్లోకి నీరు చేరడంతో అవి మొరాయించడంతో ముందుకు కదల్లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. పలు చోట్ల రోడ్లకు గుంతలు ఏర్పడి వాహనాలు వాటిలో చిక్కుకుపోయాయి.

వాహనాలపై విరిగిపడిన చెట్లు

భారీ వర్షాల దాటికి నగరంలోని పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వాహనాలపై భారీ వృక్షాలు పడిపోవడంతో దెబ్బతిన్నాయి. చెట్లు విరగడంతో ట్రాఫిక్‌ కష్టాలు మరింతగా పెరిగాయి. ఇంకొన్ని లోతట్టు ప్రాంతాల్లో అయితే ఇళ్లలోకి వరదనీరు చేరింది. అకస్మాత్తుగా ఇంత భారీ స్థాయిలో కురిసిన ఈ వానకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ నివాస ప్రాంతాలను వర్షపునీరు చుట్టుముట్టడంతో ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి ఎదుర్కొన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని