కొవిడ్‌ రిపోర్ట్‌ లేకుంటే రాష్ట్రంలోకి నో ఎంట్రీ!

తాజా వార్తలు

Updated : 05/04/2021 14:14 IST

కొవిడ్‌ రిపోర్ట్‌ లేకుంటే రాష్ట్రంలోకి నో ఎంట్రీ!

జైపుర్‌: కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతిని అరికట్టేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. నేటి నుంచి రాత్రి వేళ కర్ఫ్యూ విధించడం సహా, మల్టీప్లెక్స్‌లు, జిమ్‌ కేంద్రాలు మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా బయటి రాష్ట్రాల నుంచి రాజస్థాన్‌ వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ తీసుకురావాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభయ్‌ కుమార్ మార్గదర్శకాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే కరోనా ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ, వారాంతం లాక్‌డౌన్‌ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన క్రమంలో రాజస్థాన్‌ కూడా అదే తరహా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

రాజస్థాన్‌ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. బయటి ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు 72 గంటలు మించకుండా కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరిగా తీసుకురావాలి. ప్రజలు బహిరంగంగా వందకు మించి ఎక్కువ మంది గుమికూడరాదు. పాఠశాల విద్యార్థులకు (1 నుంచి 10వ తరగతి) ఏప్రిల్‌ 5 నుంచి 19వ తేదీ వరకు తరగతులు నిషేధం. వైద్య కళాశాలలు యథావిధిగా కొనసాగుతాయి. రాత్రి 8గంటల నుంచి ఉదయం 6గంటల వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా స్థానిక ప్రజల్ని కూడా అనవసర ప్రయాణాలు మానుకోవాలని ప్రభుత్వం సూచించింది. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనల విషయంలో కఠిన చర్యలు తప్పవని.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. కాగా రాజస్థాన్‌లో గడిచిన 24 గంటల్లో 1,729 కరోనా వైరస్‌ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని