చైనాకు అంగుళం భూమి కూడా ఇవ్వం
close

తాజా వార్తలు

Updated : 11/02/2021 11:33 IST

చైనాకు అంగుళం భూమి కూడా ఇవ్వం

రాజ్యసభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ ప్రకటన

దిల్లీ: లద్దాఖ్‌ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. అయితే ఈ ఒప్పందం వల్ల భారత్‌ ఏమీ నష్టపోలేదని వెల్లడించారు. తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆయన నేడు రాజ్యసభలో ప్రకటన చేశారు. సరిహద్దులో భారత జవాన్లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. చైనాకు అంగుళం భూమి కూడా వదులుకునేది లేదని పార్లమెంట్ వేదికగా మరోసారి స్పష్టం చేశారు. 

‘‘తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భారీగా బలగాలను మోహరించింది. ఆయుధాలను దించింది. దీంతో మన సైన్యం కూడా ప్రతిచర్య మొదలుపెట్టింది. చైనాను ఎదుర్కొనేందుకు సమర్థ బలగంతో సిద్ధమైంది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే క్రమంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మన భద్రతా బలగాలు రుజువు చేశాయి’’ అని రాజ్‌నాథ్‌ కొనియాడారు.

మన పట్టుదల చైనాకు తెలుసు

‘‘సరిహద్దు సమస్యలు చర్చలతోనే పరిష్కారమవుతాయని చైనాకు పదేపదే చెప్పాం. వాస్తవాధీన రేఖను ఇరు దేశాలు అంగీకరించాలి. అంతేగానీ, ఏకపక్ష ధోరణి ఆమోదయోగ్యం కాదని డ్రాగన్‌కు అర్థమయ్యేలా వివరించాం. సరిహద్దు ఉద్రిక్తతలపై చైనాతో జరిగిన నిరంతర చర్చలతో పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో భారత్‌, చైనా దశల వారీగా, పరస్పర సమన్వయంతో సరిహద్దుల నుంచి బలగాలను ఉపసంహరించనుంది. దేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడటంలో మనం ఎంత పట్టుదలగా ఉంటామో చైనాకు తెలుసు. మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించుకునేందుకు చైనా.. భారత్‌తో కలిసి పనిచేస్తుందని భావిస్తున్నాం’’ అని రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు. 

అంగుళం భూమిని కూడా వదులుకోం..

‘‘పాకిస్థాన్‌ అక్రమంగా భారత భూభాగాన్ని చైనాకు ఇచ్చింది. కానీ మనం ఎప్పుడూ దాన్ని గుర్తించలేదు. భారత్‌లోని కొంత భూభాగం తమదేనని చైనా చాలా సార్లు ఆరోపించింది. అయితే ఆ అనవసర ఆరోపణలను భారత్‌ ఎప్పుడూ ఒప్పుకోలేదు. భారత్‌ నుంచి అంగుళం భూమిని కూడా వదులుకోం’’ అని రాజ్‌నాథ్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

ఇదీ చదవండి..

బలగాల ఉపసంహరణ మొదలైంది


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని