ఎలుకలే.. 12 బాటిళ్ల మందు తాగేశాయి!

తాజా వార్తలు

Published : 08/07/2021 02:12 IST

ఎలుకలే.. 12 బాటిళ్ల మందు తాగేశాయి!

చెన్నై: ధాన్యం దాచిపెట్టే గోదాముల్లో, సరుకులు దాచిపెట్టే గదుల్లో ఎలుకలు చొరబడి బస్తాలను, సంచులను కొరికేసి అందులోని ఆహారాన్ని తినేస్తుంటాయి. అయితే, విచిత్రంగా ఎలుకలు మద్యం దుకాణంలో దూరి మందు బాటిళ్లు ఖాళీ చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

నీలగిరి జిల్లా గుడలూర్‌లో తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టాస్మాక్‌ మద్యం దుకాణం కరోనా.. లాక్‌డౌన్‌ వల్ల గతంలోనే మూతపడింది. ఇటీవల ఆంక్షలు సడలించడంతో టాస్మాక్‌ ఉద్యోగులు తిరిగి ఈ మద్యం దుకాణాన్ని తెరిచారు. కాగా.. దుకాణంలో 12 బాటిళ్లు ఖాళీగా ఉండటాన్ని గమనించిన ఉద్యోగులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు దుకాణానికి చేరుకొని పరిశీలించగా.. మద్యాన్ని ఎలుకలు తాగినట్లు గుర్తించారు. దుకాణంలోకి ఎలుకలు వచ్చే మార్గం, బాటిళ్ల మూతలపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు ఉండటం, బాటిళ్లు ఖాళీ అవడం చూస్తే మద్యాన్ని ఎలుకలే తాగేసి ఉంటాయని నిర్థరణకు వచ్చారు. చాలాకాలంగా దుకాణం మూతపడి ఉండటంతో ఎలుకలు చొరబడి మద్యం బాటిళ్లను ఖాళీ చేసి ఉంటాయని వెల్లడించారు. ఎలుకలు తాగేసిన మద్యం బాటిళ్ల విలువ ₹1,500 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని