
తాజా వార్తలు
సైకిల్‌పై ప్రయాణించి..మోదీని విమర్శించి
ఇంధన ధరల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేసిన వాద్రా
(ప్రతీకాత్మక చిత్రం)
దిల్లీ: ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఏసీ కార్ల నుంచి బయటకు వచ్చి, ప్రజల బాధలను తెలుసుకోవాలంటూ తీవ్ర విమర్శలు చేశారు. దిల్లీ వీధుల్లో సైకిల్‌పై ప్రయాణించి తన నిరసన వ్యక్తం చేశారు.
‘మీరు ఏసీ కార్లు దిగి, ప్రజలు పడుతున్న బాధలు చూడాలి. అప్పుడే మీరు ఇంధన ధరలు తగ్గిస్తారు’ అంటూ ప్రధాని మోదీపై రాబర్ట్ వాద్రా విమర్శించారు. అన్నింటికి మునుపటి ప్రభుత్వాల మీద నిందలు వేయడమే ప్రస్తుతం ఆయన చేసే పనంటూ మండిపడ్డారు.
హెల్మెట్, సూటు ధరించి దిల్లీలో ఖాన్ మార్కెట్ ప్రాంతంలో సోమవారం వాద్రా సైకిల్‌పై ప్రయాణించారు. అక్కడి నుంచి మరో ఇద్దరితో కలిసి తన కార్యాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తోన్న ఆయన చిత్రాలు..ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా..మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పీసీ శర్మ, జీతు పట్వారీ, కునాల్ చౌదరీ కూడా సైకిల్‌పై అసెంబ్లీకి చేరుకొని కేంద్ర వైఖరిని ఎండగట్టారు. ప్రస్తుతం దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ రూ.90.58కి లభిస్తుండగా..లీటర్ డీజిల్‌ను 80.97కి విక్రయిస్తున్నారు. గత వారం పెట్రోల్ ధర రూ.100కి పైబడింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్‌ను రూ.101.22కి విక్రయించారు.