
తాజా వార్తలు
వయస్సు 22, రిపబ్లిక్ ప్రదర్శనలు 18!
భారత సైన్యంలో జైపూర్‌కు చెందిన 61 కావల్రీ రెజిమెంట్‌కు చెందిన రియోకు ప్రదర్శనలు, కవాతులు కొత్త కాదు. దేశం గర్వంగా జరుపుకొనే గణతంత్ర దినోత్సవ కవాతుల్లో ఇప్పటికే అనేక సార్లు పాల్గొంది.. ఈ సారి కూడా పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది. రేపటి కార్యక్రమంతో సహా మొత్తం 18 సార్లు రిపబ్లిక్ డే కవాతుల్లో పాల్గొన్న రియో వయస్సు 22 ఏళ్లే. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా.. రియో ఓ అశ్వం మరి!
దిల్లీ: 61 కావల్రీ రెజిమెంట్, ప్రపంచంలోనే మనుగడలో ఉన్న ఏకైక అశ్వికదళ విభాగం. 12 అర్జున అవార్డులతో సహా ఎన్నో క్రీడాంశాల్లో బహుమతులు గెల్చుకున్న ఘనత దీని సొంతం. దీనికి తొలినుంచి భారత గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక స్థానం ఉంది. కాగా, ఈ మంగళవారం 72వ భారత్ గణతంత్ర వేడుకల్లో భాగంగా.. రియో ఈ విభాగాన్ని ముందుండి నడిపించనుంది. తన దళ కమాండర్‌ను సగర్వంగా వీపుపై ఎక్కించుకుని స్వారీ చేయనుంది.
హనోవేరియన్ జాతికి చెందిన ఈ గుర్రం భారత్‌లోనే పుట్టింది. తన నాలుగేళ్ల వయసు నుంచే రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొంటోంది. కెప్టెన్ దీపాంశు షెరాన్ శిక్షణలో మరింత రాటుదేలిన రియో.. చాలా ప్రత్యేకమైన అశ్వం. ఇది తన పైఅధికారి మాటలను విని, చక్కగా అర్ధం చేసుకుంటుందట.
ఇక రియోకు శిక్షణనిస్తున్న దీపాంశు షెరాన్ (27) ఉత్తరాఖండ్‌లోని కాశీపుర్కు చెందిన వారు. ఈయన కుటుంబంలో నాలుగు తరాలుగా సైన్యంలో సేవలందిస్తున్నారట. సంప్రదాయ రీతిలో యూనిఫాం ధరించి పాల్గోవటమే ఓ గొప్ప గౌరవం కాగా.. అదీ రియోను అధిరోహించటం మరీ ప్రత్యేకమని ఆయన అన్నారు. తాము దానిని ఎంతో ప్రత్యేక శ్రద్ధతో చూసుకుంటామని దీపాంశు చెప్పారు. స్వారీ చేస్తున్న వ్యక్తి చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటింటటం రియోకు పరిపాటి. కాగా తమ అశ్వికదళం దేశ గతం, వర్తమానాలకు మధ్య సంబంధంగా నిలుస్తోందని ఆయన అన్నారు.