జంతువుల్లో కరోనా: టీకా సిద్ధం చేసిన రష్యా
close

తాజా వార్తలు

Published : 30/04/2021 23:11 IST

జంతువుల్లో కరోనా: టీకా సిద్ధం చేసిన రష్యా

మాస్కో: మూగజీవాలు కూడా కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రయోగాలు సఫలం కావడంతో ఈమధ్యే వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసుకున్నట్లు ప్రకటించింది. తాజాగా 17వేల డోసులతో కూడిన వ్యాక్సిన్‌ మొదటి బ్యాచ్‌ను సిద్ధం చేసినట్లు రష్యా ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది. తొలుత వీటిని రష్యాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తామని తెలిపింది. జర్మనీ, దక్షిణ కొరియా, ఆస్ట్రియా, గ్రీస్‌, పోలాండ్‌, కెనడా, మలేసియా, థాయిల్యాండ్‌, అమెరికాతో పాటు సింగపూర్‌కు చెందిన పలు సంస్థలు ఈ వ్యాక్సిన్‌ను కొనేందుకు ముందుకు వచ్చినట్లు ఆ సంస్థ పేర్కొంది.

కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు కరోనా వైరస్‌ సోకుతున్నట్లు కొన్ని దేశాల్లో ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో వాటికీ వ్యాక్సిన్‌ తీసుకొచ్చేందుకు కొంతకాలం నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా జంతువుల్లోనూ ప్రయోగాలు చేపట్టిన రష్యా.. ఆశాజనక ఫలితాలు వచ్చినట్లు వెల్లడించింది. ‘కార్నివాక్‌-కొవ్‌’ పేరుతో రష్యా జాతీయ జంతువుల సంరక్షణ విభాగం ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. కుక్కలు, పిల్లులు, నక్కలతో పాటు ఇతర మూగజీవాలపై గతేడాది నుంచే వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ మొదలు పెట్టామని.. వాటిలో యాంటీబాడీలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడైనట్లు తెలిపింది. ఈమధ్యే వీటికి అధికారికంగా రిజిస్టర్‌ చేసుకున్నట్లు ప్రకటించింది. తాజాగా వ్యాక్సిన్‌ డోసులను కూడా అందుబాటులోకి తేవడంతో జంతువులకు కరోనా వ్యాక్సిన్‌ను తీసుకువచ్చిన తొలిదేశంగా రష్యా నిలిచింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని