close

తాజా వార్తలు

Updated : 12/04/2021 16:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

 ‘విరాట్‌’నౌకను తుక్కు చేయొచ్చు

విచ్ఛిన్నాన్ని ఆపేందుకు సుప్రీం నిరాకరణ

దిల్లీ: మూడు దశాబ్దాల పాటు భారత నౌకాదళంలో సేవలందించిన విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను తుక్కు చేసే ప్రక్రియను కొనసాగించొచ్చని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ నౌక విచ్ఛిన్న ప్రక్రియను ఆపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్‌ చాలా ఆలస్యంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే నౌకలోని 40శాతాన్ని తుక్కుగా చేసినందున, ఇప్పుడు విచ్ఛిన్న ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 

29ఏళ్ల పాటు భారత నౌకాదళంలో సేవలందించిన ఐఎన్‌ఎస్‌ విరాట్‌ జీవనకాలం పూర్తవడంతో 2017 మార్చిలో నేవీ దీన్ని పక్కనబెట్టింది. తొలుత దీన్ని మ్యూజియంగా మార్చాలని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ఆ ప్రణాళికలు ఫలించకపోవడంతో దీన్ని తుక్కుగా మార్చి విక్రయించాలని కేంద్రం నిర్ణయించి శ్రీరాం షిప్‌ బ్రేకర్స్‌ అనే సంస్థకు అమ్మేసింది. దీంతో ఈ నౌకను గుజరాత్‌లోని అలంగ్‌ తీరానికి తీసుకొచ్చారు. ఇప్పటికే నౌకలోని కొంతభాగాన్ని తొలగించి చేశారు. అయితే, దీనిని మ్యూజియంగా మార్చాలని భావిస్తున్న ఎన్విటెక్‌ అనే మరో సంస్థ నౌకను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. కానీ, రక్షణశాఖ నుంచి నిరభ్యంతర పత్రం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం విచ్ఛిన్న ప్రక్రియపై స్టే విధించింది. అయితే, తాజాగా పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం.. విరాట్‌ను తుక్కుగా మార్చొచ్చని స్పష్టం చేసింది. 

విరాట్‌ ప్రత్యేకతలు ఇవే..

> ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం యుద్ధ రంగంలో సేవలందించిన నౌక ఇదే.

> 60 ఏళ్ల ఘన చరిత గల విరాట్‌.. 1959లో బ్రిటిష్‌ రాయల్‌ నేవీలో చేరింది. ఆ తర్వాత 1984లో దీన్ని ఉపసంహరించి భారత్‌కు విక్రయించారు. 1982 లో దక్షిణ అట్లాంటిక్‌లో జరిగిన ఫాక్లాండ్‌ దీవుల్లో జరిగిన యుద్ధంలో అద్భుతమైన సేవలు అందించింది

> 1987లో భారత నౌకాదళంలో చేరిన విరాట్‌.. దాదాపు 30ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించింది. 

> విరాట్‌ను విచ్ఛిన్నం చేస్తే.. భారత్‌లో తుక్కుగా మారుతున్న రెండో యుద్ధ నౌక ఇదే కానుంది. అంతకుముందు 2014లో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను తుక్కుగా మార్చేశారు. ఆ విడిభాగాలతో ఓ ఆటోమొబైల్‌ సంస్థ ద్విచక్రవాహనాలకు కూడా తయారుచేసింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని