Rath Yatra: మాక్కూడా విచారంగానే ఉంది..

తాజా వార్తలు

Published : 07/07/2021 01:23 IST

Rath Yatra: మాక్కూడా విచారంగానే ఉంది..

ఇతర ప్రాంతాల్లో రథయాత్రకు నిరాకరించిన సుప్రీం

దిల్లీ: ప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్రను కేవలం పూరీలో మాత్రమే నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఒడిశాలోని ఇతర ప్రాంతాల్లో నిర్వహణకు అనుమతిని నిరాకరించింది.  పూరీలో మినహా ఇతర ప్రాంతాల్లో రథయాత్రను రద్దు చేస్తూ ఒడిశా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలో ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. కరోనా రెండో దఫా విజృంభణ ఇంకా ముగియలేదని, ఆగస్టులో మూడోముప్పు రానుందనే నివేదికల మధ్య ఈ తీర్పును వెలువరించింది. 

‘విపత్తు నిర్వహణ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల విషయంలో మేం జోక్యం చేసుకోం. ప్రస్తుత పరిస్థితులు మాకు కూడా విచారాన్ని కలిగిస్తున్నాయి. వచ్చే ఏడాదికైనా పరిస్థితులు అనుకూలిస్తాయని ఆశిస్తున్నాం. నేను కూడా ప్రతి సంవత్సరం పూరీకి వెళ్తాను. గత ఏడాదిన్నరగా అది సాధ్యపడట్లేదు. నేను ఇంట్లోనే పూజలు చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది’ అని ప్రధాన న్యాయమూర్తి తీర్పులో భాగంగా వ్యాఖ్యానించారు.

కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా భక్తులు లేకుండానే జగన్నాథ రథయాత్ర జరగనుంది. జులై 12న దీన్ని నిర్వహించనున్నారు. రథయాత్రను కేవలం పూరీలో మాత్రమే నిర్వహిస్తామని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జగన్నాథ రథయాత్రలు ఉండవని ఒడిశా ప్రభుత్వం ఇదివరకే వెల్లడించింది. గత ఏడాది వేడుక సందర్భంగా పాటించిన నిబంధనలను ఈ సారి కూడా అమలు చేస్తామని తెలిపింది. భక్తులు పూరీ రథయాత్రను ప్రత్యక్ష ప్రసారాల్లో వీక్షించాలని సూచించింది.  



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని