close

తాజా వార్తలు

Published : 20/01/2021 14:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కమిటీ సభ్యులను కించపరుస్తారా?

రైతు సంఘాల నేతలపై సుప్రీం ఆగ్రహం

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఏర్పాటు చేసిన కమిటీపై కొందరు రైతు సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి ప్రకటించింది. తాము కమిటీ సభ్యులకు ఎలాంటి నిర్ణయాధికారం ఇవ్వలేదని, అలాంటప్పుడు వారిని కించపర్చేలా మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై గతవారం స్టే విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. సమస్య పరిష్కారం కోసం నలుగురు సభ్యులతో ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో భూపీందర్‌సింగ్‌ మాన్‌, ప్రమోద్‌ కుమార్‌, అశోక్‌ గులాటి, అనిల్‌ ఘన్వత్‌ ఉన్నారు. అయితే ఈ కమిటీని కొందరు రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. వీరంతా ప్రభుత్వానికి అనుకూల వ్యక్తులని, సాగు చట్టాలను సమర్థిస్తూ గతంలో వ్యాసాలు కూడా రాశారని ఆరోపించారు. అలాంటి కమిటీ ముందు తాము హజరయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 

ఇది కాస్తా వివాదాస్పదంగా మారడంతో సభ్యుల్లో ఒకరైన మాన్‌ కమిటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా.. కమిటీపై వస్తున్న విమర్శలపై చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

నిపుణులపై నిందలు తగదు..

‘‘వ్యవసాయంలో న్యాయమూర్తులు నిపుణులు కాదు. అందుకే ఈ కమిటీని ఏర్పాటు చేశాం. ఇందులో సభ్యులంతా ఈ రంగంలో ఎంతో అనుభవం కలిగిన నిపుణులు. అయితే ఈ కమిటీకి మేం ఎలాంటి నిర్ణయాధికారం ఇవ్వలేదు. కేవలం వారు ఇరు పక్షాల అభిప్రాయాలను మాత్రమే వింటారు. అలాంటప్పుడు పక్షపాతం అనే ప్రశ్న ఎక్కడొస్తుంది? మేం ఎవరినీ బలవంతపెట్టట్లేదు. మీకు(రైతు సంఘాల నేతలు) నచ్చకపోతే కమిటీ ముందు హాజరుకాకండి. అంతేగానీ.. అభిప్రాయాలు చెప్పారని వారిపై నిందలు వేయడం, వారిని కించపర్చడం సరికాదు. ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. అయితే ఎదుటివారి వాదనలు విన్న తర్వాత ఒక్కోసారి వారి సొంత అభిప్రాయాలు కూడా మారిపోతుంటాయి’’ అని ధర్మాసనం తెలిపింది. పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. 

ట్రాక్టర్ల ర్యాలీపై పిటిషన్‌పై కేంద్రం వెనక్కి..

ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం నాడు రైతుల తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి వ్యతిరేకంగా కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. అది పూర్తిగా పోలీసులకు సంబంధించిన విషయమని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ట్రాక్టర్ల ర్యాలీపై నిర్ణయాన్ని దిల్లీ పోలీసులకు వదిలేస్తున్నట్లు తెలిపిన కేంద్రం.. పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది.

ఇవీ చదవండి..

టీకా తెరిస్తే ఆలోగా వాడేయాలి.. లేదంటే

పెరుగుతున్న ఉత్పరివర్తనల ముప్పు!Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని