
తాజా వార్తలు
సెనేట్‌లో డెమొక్రాట్లదే పైచేయి
ముగ్గురు కొత్త సభ్యుల ప్రమాణం
ఆ వెంటనే బైడెన్ తొలి కేబినెట్ నామినేషన్‌కు ఆమోదం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షునిగా బైడెన్ బాధ్యతలు స్వీకరించిన క్రమంలోనే... కొత్తగా ఎన్నికైన ముగ్గురు డెమొక్రాటిక్ పార్టీ సెనేటర్లు కూడా ప్రమాణం చేశారు. జార్జియా నుంచి ఎన్నికైన పాత్రికేయుడు ఒస్సోఫ్, అట్లాంటాకు చెందిన పాస్టర్ వార్నాక్, కాలిఫోర్నియా నుంచి గెలుపొందిన అలెక్స్ పడిల్లాలతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రమాణం చేయించారు. దీంతో ఇప్పటివరకూ రిపబ్లికన్లు ఆధిక్యత చాటుతూ వచ్చిన సెనేట్‌లో ఇప్పుడు డెమొక్రాట్లు పైచేయి సాధించినట్టయింది.
కొత్త అధ్యక్షుని ప్రమాణం రోజు... ఆయన యంత్రాంగానికి సంబంధించిన కొంతమంది నియామకాలకు సెనేట్ ఆమోదం తెలపడం ఆనవాయితీ. ఈ మేరకు బుధవారం సాయంత్రం కొత్త సభ్యుల ప్రమాణం అనంతరం సభ సమావేశమైంది. అధ్యక్షుని భద్రతా బాధ్యతలు చేపట్టే ‘నేషనల్ ఇంటెలిజెన్స్’ డైరెక్టరుగా బైడెన్ తన కాబినెట్‌కు నామినేట్ చేసిన అర్విల్ హైనెస్ నియామకానికి 84-10 ఓట్ల తేడాతో సెనేట్ ఆమోదం తెలిపింది.
ట్రంప్ అభిశంసనపై త్వరలో చర్చ!
కాంగ్రెస్ భవనం ‘క్యాపిటల్ హిల్’పై ఈనెల 6న ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణపై డొనాల్డ్‌ను అభిశంసిస్తూ ఇప్పటికే దిగువసభ తీర్మానం చేసింది. స్పీకర్ నాన్సీ పెలోసీ త్వరలోనే దీన్ని సెనేట్ ఆమోదం కోసం పంపే వీలుంది. ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో తలపడకుండా నిషేధం విధించాలని పలువురు చట్టసభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో- మాజీ అధ్యక్షునిపై అభిశంసన విచారణ (ఇంపీచ్మెంట్ ట్రయల్) సందర్భంగా సెనేట్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తిగా మారింది.
మరోవైపు- కరోనా మహమ్మారిని నియంత్రించేందుకూ, ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకూ బైడెన్ ప్రతిపాదించిన 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని కాంగ్రెస్ పరిశీలించి, ఆమోదించనుంది. భారీ స్థాయిలో కొవిడ్-19 రికవరీ, టీకా కార్యక్రమాలను ఈ ప్యాకేజీ కింద చేపట్టనున్నారు.
బైడెన్-హారిస్‌ల నాయకత్వంలో అమెరికా కోలుకుంటుంది
విశ్వాసం వ్యక్తం చేసిన భారత సంతతి చట్టసభ్యులు
న్యూయార్క్: ట్రంప్ పాలనలో ధ్వంసమైన అమెరికా... బైడెన్-హారిస్‌ల నాయకత్వంలో కోలుకుంటుందని భారత సంతతి అమెరికన్ చట్టసభ్యులు విశ్వాసం వ్యక్తం చేశారు. దిగజారిన దేశ ఆర్థిక వ్యవస్థను వారు ప్రగతిపథాన నడిపించగలరని పేర్కొన్నారు. ఈ మేరకు ఇండో-అమెరికన్ సలహా సంస్థ ‘ఇంపాక్ట్’ ఆధ్వర్యాన నిర్వహించిన వీడియో సమావేశంలో చట్టసభ్యులు రాజా క్రిష్ణమూర్తి, రోహిత్ ఖన్నా, అమీ బెరా, ప్రమీలా జయపాల్, నీరా టాండెన్ తదితరులు మాట్లాడారు. ‘‘వలస కుటుంబానికి చెందిన కమలా హారిస్ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టి అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించారు. ఆమె ఈ స్థానానికి చేరుకోవడం దేశ ప్రజలకు గర్వకారణం. అగ్రరాజ్య ప్రథమ ఉపాధ్యక్షురాలిగా కమల ఎప్పటికీ నిలుస్తారు. ఇది ఇక్కడితో ఆగిపోదు. ఆమె స్ఫూర్తిని తర్వాతి తరాలకు అందిస్తాం’’ ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీల్ మఖీజా పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
కరోనాపై యుద్ధంలో బైడెన్ అస్త్రాలివే..
కేంబ్రిడ్జి అనలిటికాపై సీబీఐ కేసు